హోరెత్తించే సాంగ్స్, హుషారెత్తించే డ్యాన్సులతో చైనాలోని బామ్మలు వీధుల్లో తెగ హంగామా చేసేస్తున్నారు. శతాబ్దాల క్రితంనాటి ‘డ్యాన్సింగ్ గ్రానీస్’ సంస్కృతికి కొత్త స్టెప్స్ అద్దుతున్నారు. ఈ ప్రోగ్రామ్ స్థానికులకు కొత్త తలనొప్పులను తీసుకొస్తున్నది. దీంతో ఓ వ్యక్తి ఈ సమస్యకు చక్కని పరిష్కారాన్ని కనిపెట్టాడు. అసలు ‘డ్యాన్సింగ్ గ్రానీస్’.. వారి కథాకమామిషు ఏమిటంటే..
ఎవరీ డ్యాన్సింగ్ గ్రానీస్?
నడివయస్కులైన మహిళలు, వృద్ధ మహిళలు సిటీ మధ్యలోని ఓ పార్కులో లేదా రద్దీగా ఉండే షాపింగ్ మాల్ లేదా ఓ ప్లాజా హాల్లో వరుసగా నిల్చొని.. పెద్దగా మ్యూజిక్ ప్లే చేస్తూ.. నృత్యాన్ని చేయడాన్ని ‘స్కేర్ డ్యాన్సింగ్’గా పిలుస్తారు. వృద్ధులు ఈ నృత్యాలు చేస్తుండటంతో వీరిని ‘డ్యాన్సింగ్ గ్రానీస్’గా పిలుస్తున్నారు. చైనాలో ఇటీవల ఈ సంస్కృతి మళ్లీ ఎక్కువగా కనిపిస్తున్నది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో బామ్మలు విరామంలేకుండా నృత్యాన్ని చేస్తున్నారు.
సమస్య ఏంటి?
సిటీ మధ్యలో బామ్మలు నృత్యాలు చేయడం చైనాలోని వాణిజ్య దుకాణాల యజమానులకు ఇబ్బందిగా మారింది. 4 వేల ఏండ్ల పురాతన నృత్య సంస్కృతి కావడంవల్ల వాళ్లు ఏమీ అనలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా నియంత్రించడం లేదు. అయితే, బామ్మలు పెద్దగా మ్యూజిక్ ప్లే చేస్తుండటంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందిగా మారింది. దీంతో జియాంగ్జీకి చెందిన ఓ వ్యక్తి ‘యాంటీ-స్కేర్ డ్యాన్సింగ్ టూల్’ అనే వినూత్న డివైజ్ను కనిపెట్టాడు. ప్లే అవుతున్న స్పీకర్ను లేజర్ కాంతి సాయంతో 50 నుంచి 80 మీటర్ల దూరం నుంచే నియంత్రించడం దీని ప్రత్యేకత. ఉన్నట్టుండి స్పీకర్ పనిచేయడం నిలిచిపోవడంతో ‘అది పాడైపోయింద’ని భావించిన గ్రానీలు ఇండ్లకు వెళ్లిపోతున్నట్టు ఆ వ్యక్తి సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది తెలిసిన పలువురు చైనీయులు తమకు కూడా ఆ డివైజ్ కావాలని కామెంట్లు పెడుతున్నారు.
4 వేల ఏండ్ల నుంచీ..
‘స్కేర్ డ్యాన్సింగ్’ను 4 వేల ఏండ్ల క్రితం.. అంటే క్రీస్తుపూర్వం 2,333లో చైనాను పాలించిన అప్పటి చక్రవర్తి యోవో ఈ స్కేర్ డ్యాన్సింగ్ను తీసుకొచ్చారు. రాజ్యంలో నడివయస్కులైన పురుషులు, మహిళలు అధిక బరువుతో ఇబ్బందులు పడుతుండటం, వ్యాయామాన్ని సక్రమంగా చేయకపోవడంతో ఈ కాన్సెప్టును యోవో తీసుకొచ్చారు. సంప్రదాయ సంగీతాన్ని వాద్యకారులు వాయిస్తుంటే ప్రజలు ఎంతో సంబురంగా నృత్యాన్ని చేసేవారు. కాలక్రమేణా ఈ సంప్రదాయం కనుమరుగైనట్టు కనిపించింది. అయితే, ఇటీవల చైనాలో వృద్ధ జనాభా పెరిగిపోవడం, కుటుంబసభ్యులతో దూరం పెరుగడం తదితర కారణాలతో ఆత్మన్యూనతకు గురయిన వృద్ధ మహిళలు తమ శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసం కోసం ఈ ‘స్కేర్ డ్యాన్సింగ్’ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.