వాషింగ్టన్: ఒక వ్యక్తి పేగు లోపల చెక్కుచెదరని ఈగను డాక్టర్లు గుర్తించారు. (House Fly Inside Man’s Intestines) అయితే ఆ భాగానికి అది ఎలా చేరిందో అన్నదానిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికాలోని మిస్సోరీలో ఈ సంఘటన జరిగింది. 63 ఏళ్ల వ్యక్తి సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు అతడికి కొలొనోస్కోపీ టెస్ట్ నిర్వహించారు. పెద్ద పేగు పైభాగంలో వంపు వద్ద చెక్కుచెదరకుండా ఉన్న ఈగను గుర్తించారు. కొలొనోస్కోపీ పరికరం ద్వారా దానిని అటు ఇటు కదిలించారు. అయితే ఆ ఈగలో ఎలాంటి చలనంలేకపోవడంతో అది చనిపోయినట్లు గ్రహించారు.
కాగా, ఏ మాత్రం చెక్కుచెదరకుండా పెద్ద పేగులో ఉన్న ఆ ఈగ ఆ వ్యక్తి శరీరంలోకి ఎలా ప్రవేశించో అన్న దానిపై డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈగ ఆ వ్యక్తి నోటి ద్వారా శరీరంలోకి వెళ్లి ఉంటే కడుపులోని జీర్ణ రసాలు, జీర్ణ ప్రక్రియ వల్ల అరిగిపోయి ఉండేదని తెలిపారు. ఒకవేళ మల ద్వారం ద్వారా పెద్ద పేగు పైభాగానికి ఆ ఈగ చేరి ఉంటుందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే అలా జరిగే అవకాశం ఎంత మాత్రం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు చాలా అరుదైందని, మిస్టరీతో కూడుకున్నదని యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్లు పేర్కొన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో ఈ విషయాన్ని ప్రచురించారు.