లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు జీవశాస్త్రంలో అద్భుత ఆవిష్కరణ చేశారు. ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏ(DNA)తో.. శిశువులకు ప్రాణం పోశారు. జీవకణాల్లోని మైటోకాండ్రియా ద్వారా సంక్రమించే జన్యుపరమైన వ్యాధులను నివారించే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు కొత్త ప్రక్రియను అభివృద్ధి చేశారు. పేరెంట్స్‌తో పాటు మూడో వ్యక్తికి చెందిన డీఎన్ఏతో .. 8 మంది ఆరోగ్యవంతమైన శిశువులకు జీవం పోశారు.
తల్లికి చెందిన అండం, తండ్రికి చెందిన శుక్రకణంతో పాటు డోనార్ మహిళకు చెందిన రెండో అండాన్ని తీసుకుని కొత్త తరహాలో శిశువులకు ప్రాణం పోశారు. వాస్తవానికి బ్రిటన్‌లో ఈ టెక్నిక్‌ను చాన్నాళ్ల నుంచి వినియోగిస్తున్నారు. అయితే మైటోకాండ్రియా ద్వారా సంక్రమించే వంశపారంపర్య వ్యాధులు లేకుండా తొలిసారి బిడ్డలు పుట్టినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. సాధారణంగా తల్లి నుంచి సంక్రమించే వ్యాధులకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఈ టెక్నిక్‌ను డెవలప్ చేశారు.
మనిషి కణంలోని మైటోకాండ్రియా ప్రమాదకర రీతిలో మ్యుటేషన్స్ చెందుతుంది, దాని వల్ల జన్యుపరమైన వ్యాధులు వస్తుంటాయి. మైటోకాండ్రియా వల్ల పిల్లల్లో కండరాల బలహీనత, శరీరాభివృద్ధి లోపం, మూర్చ, అవయవ వైఫలం లాంటి వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అయితే ఐవీఎఫ్ ప్రక్రియలో ముగ్గురు డీఎన్ఏలను తీసుకుని, పిల్లలకు వ్యాధులు సంక్రమించకుండా చర్యలు తీసుకున్నారు. డోనార్ అండం నుంచి ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియాను తీసుకుని ఈ విధానాన్ని అమలు చేశారు.
2023లో తొలిసారి ఈ పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఐవీఎఫ్ టెక్నిక్ ద్వారా.. తల్లి అండం లేదా పిండం నుంచి జన్యుపదార్ధాన్ని తీసుకుని, ఆ తర్వాత దాన్ని డోనార్ పిండం లేదా అండంలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. డోనార్ అండంలో ఆరోగ్యకరమైన మైటోకాండ్రియా ఉంటుందని, ఇక డీఎన్ఏలోని మిగితా వాటిని తొలగిస్తారని పరిశోధకులు తెలిపారు.
ముగ్గురు డీఎన్ఏతో పుట్టిన పిల్లల్లో.. ఎక్కువగా పేరెంట్స్‌కు చెందిన జన్యు నిర్మాణమే ఉంటుందని, కేవలం 0.1 శాతం మాత్రమే మైటోకాండ్రియా దాతకు చెందిన జన్యు నిర్మాణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు. లండన్‌లోని న్యూకాసిల్ ఫెర్టిలిటీ సెంటర్లో ఈ ప్రక్రియ చేపట్టారు.
శరీరానికి శక్తినివ్వడంలో మైటోకాండ్రియా కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రతి కణంలో మైటోకాండ్రియా ఉంటుందని, మన శ్వాసకు ఆ కణాలే కారణమని, ఆక్సిజన్‌ను తీసుకుని ఆహారాన్ని శక్తి రూపంగా మార్చేది మైటోకాండ్రియా అని శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఒకవేళ కణంలోని మైటోకాండ్రియా బలహీనంగా ఉంటే, అప్పుడు మన గుండె పనితీరు కూడా నిసత్తువగా మారుతుందన్నారు.
సుమారు 5వేల మంది శిశువుల్లో ఒకరు మైటోకాండ్రియా సంబంధిత వ్యాధులతో పుడుతారని, ముగ్గురి డీఎన్ఏతో ప్రతి ఏడాది 20 నుంచి 30 మంది శిశువులకు ప్రాణం పోసే అవకాశాలు ఉన్నట్లు న్యూకాసిల్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.