పారిస్: ఫ్రాన్స్ ప్రధాని మైఖేల్ బార్నియర్(Michel Barnier)కు చుక్కెదురైంది. జాతీయ పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోయారు. దీంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. అతివాద, వామపక్ష నేతలందరూ బార్నియర్కు వ్యతిరేకంగా ఓటేశారు. బడ్జెట్ కేటాయింపులపై మొదలైన రగడ.. ప్రధాని పీఠానికే ఎసరుపెట్టింది. సోషల్ సెక్యూర్టీ బడ్జెట్ ప్లాన్ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 49.3 ద్వారా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
అవిశ్వాసంలో ఓడిన ప్రధాని బార్నియర్.. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడపనున్నారు. మాజీ ప్రధాని గాబ్రియల్ అటల్ కూడా ఇలాగే తమ ప్రభుత్వాన్ని నడిపిన విషయం తెలిసిందే. ఆపద్దర్మ ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించే వీలు ఉండదు. అయితే అధ్యక్షుడు మాక్రన్ కొత్త ప్రధానిని నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి మాత్రం ప్రత్యేకమైన డెడ్లైన్ ఏదీ లేదు. 24 గంటల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు అధ్యక్షుడు మాక్రన్ తెలిపారు. ప్రస్తుత పార్లమెంట్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేని కారణంగా.. కొత్త ప్రధాని ఎన్నిక సంక్లిష్టంగానే మారనున్నది.
కొత్త ప్రధాని ఎవరు అవుతారన్న దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సైనిక శాఖ మంత్రి సెబాస్టియన్ లెకోర్న్ పేరు వినిపిస్తున్నది. సెంట్రిస్టు మోడెమ్ పార్టీ నేత ఫ్రాంకోయిస్ బేరౌ పేరు కూడా ప్రస్తావనలో ఉన్నది. వామపక్ష ఎన్ఎఫ్పీ కూటమి మాత్రం ఆర్థికవేత్త లూసి కాస్టెట్స్ పేరును ప్రస్తావిస్తున్నది. దేశాన్ని పాలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల కాస్టెట్స్ పేర్కొన్నారు.