పారిస్: ఫ్రాన్స్ కొత్త ప్రధాన మంత్రి సెబాస్టియన్ లెకోర్నుకు ప్రారంభంలోనే తీవ్ర నిరసనలు సవాలు విసురుతున్నాయి. పారిస్‌లో నిరసనకారులు బుధవారం రోడ్లను దిగ్బంధం చేశారు, టైర్లకు నిప్పుపెట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌పై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ‘బ్లాక్ ఎవ్రీథింగ్’ ఉద్యమం సామాజిక మాధ్యమాల్లో వేసవి సమయంలో ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దిగ్బంధనాలు, సమ్మెలు, ప్రదర్శనలు, ఇతర నిసరన కార్యక్రమాలను నిర్వహించాలని రహస్య సంభాషణల ద్వారా పిలుపునిచ్చారు. మాజీ పీఎం బేరౌ బడ్జెట్ ప్లాన్స్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ ఉద్యమానికి నిర్దిష్ట నాయకత్వం లేదు. అయితే, డిమాండ్లు అధికంగానే ఉన్నాయి. అసమానతల గురించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మాక్రాన్ 2022లో మరోసారి దేశాధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి నిరసనకారులు పింఛను సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు. ఫ్రాన్స్ పార్లమెంటులో సోమవారం విశ్వాస పరీక్షలో ప్రధాన మంత్రి ఫ్రానోయిస్ బేరౌ ఓడిపోయారు. దీంతో మాక్రాన్ మంగళవారం సెబాస్టియన్‌ను పీఎంగా నియమించారు.