పారిస్: ఫ్రాన్స్‌లో కరోనా (Corona) వైరస్ జూలు విదిల్చింది. గత రెండు రోజులుగా దేశంలో రెండు లక్షలకు మంది వైరస్ బారినపడుతుండటంతో మొత్తం కేసులు కోటి దాటాయి. దీంతో కోటి కేసులు నమోదైన ఆరో దేశంగా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటికే అమెరికా, భారత్, బ్రెజిల్, బ్రిటన్, రష్యాల్లో పది మిలియన్లు దాటాయి.
దేశంలో గత 24 గంటల్లో 2,19,126 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా శుక్రవారం కూడా 2,23,200 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ మరికొన్ని వారాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా, భారీ ఎత్తున కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేసింది.
ఫ్రాన్స్‌లో ప్రస్తుతం 1,01,91,926 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,23,851 మంది మరణించగా, 81,34,841 మంది కోలుకున్నారు. మరో 19,33,234 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.