కౌలాలంపూర్: జైలు శిక్ష అనుభవిస్తున్న మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్ శుక్రవారం అవినీతి కేసులో దోషిగా తేలారు. 1 మలేషియా డెవలప్మెంట్ బెర్హాద్(1ఎండీబీ)గా పిలిచే ఈ కుంభకోణం ఆధునిక ప్రపంచ చరిత్రలో జరిగిన అతి పెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటి. నజీబ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ దేశ హైకోర్టు తేల్చింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా నజీబ్‌పై నమోదైన అవినీతి కేసుల్లో ఆ కోర్ట్ తీర్పులు ఇస్తూనే ఉంది.
1ఎండీబీ స్కామ్ ద్వారా నజీబ్ 700 మిలియన్ల అమెరికన్ డాలర్ల ప్రజా ధనాన్ని తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. నజీబ్ 2009-2018 మధ్య కాలంలో ప్రధానిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. 1ఎండీబీ స్కామ్ కారణంగానే అధికారాన్ని కోల్పోయిన ఆయన ఈ స్కామ్‌కు సంబంధించిన కేసులోనే ప్రస్తుతం జైల్లో ఉన్నారు. 2009లో అధికారం చేపట్టగానే దేశ ఆర్థికాభివృద్ధికి హామీగా చెప్తూ 1ఎండీబీ నిధిని నజీబ్ ఏర్పాటు చేశారు.