టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. ఆయనపై ఇవాళ హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. నారా సిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వెనుక నుంచి వచ్చి తుపాకీతో కాల్చాడు. షింజో అబే ఛాతి, మెడలోకి బుల్లెట్లు దిగినట్లు తెలిసింది. అబేను హుటాహుటిన ఆస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. కానీ 67 ఏళ్ల షింజో అబే హాస్పిటల్లో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ద్రువీకరించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.03 నిమిషాలకు షింజో మృతిచెందినట్లు హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి.
రాజీనామా చేసినా.. రాజకీయాల్లో యాక్టివ్గానే
షింజో అబే తన ప్రధాని పదవికి 2020లో రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా ఆయన పదవికి రాజీనామా చేశారు. కానీ ఆయన మాత్రం రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన రెగ్యులర్‌గా మీడియాలో కనిపించేవారు. కరెంట్ అఫైర్స్ గురించి చర్చించేందుకు ఆయన తరుచూ మీడియాలో కనిపించేవారు. నాటో సభ్యుల తరహాలోనే అణ్వాయుధాల షేరింగ్ అంశాన్ని జపాన్ చర్చించాలని ఫిబ్రవరిలో ఓ డిబేట్లో తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా అటాక్ చేసిన నేపథ్యంలో ఆయన ఆ అభిప్రాయాన్ని వినిపించారు.
శుక్రవారం నారా పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సయమంలో ఓ ఆగంతకుడు షింజోపై కాల్పులు జరిపాడు. ఎగువ సభకు ఎన్నికల నేపథ్యంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తరపున షింజో ప్రచారం నిర్వహించారు. నారా తర్వాత క్యోటో, సైతామాలో ఆయన ప్రచారం చేయాల్సి ఉంది. జపాన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా చేసిన వ్యక్తిగా అబేకు గుర్తింపు ఉన్నది. 2006 నుంచి 2007, ఆ తర్వాత 2012 నుంచి 2020 వరకు ఆయన ఆ దేశ ప్రధానిగా చేశారు.
రాయల్ ఫ్యామిలీ..
షింజో అబేది పేరుగల కుటుంబం. ఆయన తండ్రి షింతారో అబే ఆ దేశ విదేశాంగ మంత్రిగా చేశారు. ఇక అబే తాత ఆ దేశ ప్రధానిగా చేశారు.మాజీ ప్రధాని నొబుషుకే కిషి మనువడే షింజో అబే. రాజకీయంగా షింజో ఫ్యామిలీకి ఘన చరిత్ర ఉంది. అయినా జపాన్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా షింజో కొనసాగారు. ప్రధానిగా ఉన్న సమయంలో షింజే తన ఆర్థిక విధానాలతో ఆకట్టుకున్నారు. విదేశాంగ, ఆర్థిక విధానాల వల్ల ఆయనకు ఎబినామిక్స్ అన్న పేరు వచ్చింది.
షింజో అబే సెప్టెంబర్ 21, 1954లో జన్మించారు. షింజో తాతయ్య, పెద్దనాన్నలు ఆ దేశ ప్రధానులుగా చేశారు. ఆయన తండ్రి విదేశాంగ మంత్రిగా చేశారు. టోక్యోలోని సీకీ యూనివర్సిటీలో పోలిటిక్స్ చదివారు. యునివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. తొలుత ఆయన బిజినెస్‌లోకి ఎంటర్ అయ్యారు. 1979లో కోబే స్టీల్‌లో పనిచేశారు. మూడేళ్ల తర్వాత.. విదేశాంగ శాఖలో అసిస్టెంట్‌గా చేరారు.
1993లో తొలిసారి జపాన్ ప్రతినిధుల సభకు ఆయన ఎన్నికయ్యారు. అప్పుడు షింజో వయసు 38 ఏళ్లు. ఎన్నో క్యాబినెట్ హోదాల్లో పని చేశారు. ఎల్డీపీ పార్టీకి 2003లో సెక్రటరీ జనరల్ అయ్యారు. ఆ తర్వాత నాలుగేళ్లకు పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత జపాన్ ప్రధాని అన్నారు. తొలి టర్మ్‌లో కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఆరోగ్యం క్షీణించడంతో .. పార్టీకి, ప్రధాని పదవికి రాజీనామా చేశారు. 2012 నుంచి 2020 వరకు ఆయనే ప్రధానిగా చేశారు. 67 ఏళ్ల వయసులో తూపాకీ కాల్పుల్లో షింజో అబే మరణించారు.