Foreign Education | న్యూఢిల్లీ, నవంబర్ 4 : విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులతోపాటు ఇతర దేశాల విద్యార్థులు ఇప్పటివరకు ప్రధానంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌కు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాకు వెళ్లేందుకు విదేశీ విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. విదేశీ విద్య కోసం జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ లాంటి వర్ధమాన ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇటీవల బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలో వలస విధానాలు మారడం, వీసా నిబంధనలు కఠినతరమవడం, అంతర్జాతీయ సంఘర్షణలు పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణమని ఐడీఎఫ్ (ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) సర్వేలో తేలింది.
ఈ ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించిన ఈ సర్వేలో 114 దేశాలకు చెందిన 6 వేల మందికిపైగా విద్యార్థుల అభిప్రాయాలను సేకరించారు. ఈ ఏడాది విదేశీ విద్యార్థుల్లో 24% మంది ఆస్ట్రేలియాను, 21% మంది బ్రిటన్ను ఎంచుకున్నారని, 16% మంది కెనడాను ఎంచుకున్నారని, ఇది నిరుటి కంటే 9% తక్కువని పేర్కొన్నది. భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగడం, కెనడాలో వీసా నిబంధనలను కఠినతరం చేయడం ఇందుకు కారణమని తెలిపింది.