వాషింగ్టన్: అమెరికాలో బుధవారం విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక లోపం వల్ల సుమారు 9600 విమానాలు ఆలస్యం అయ్యాయి. మరో 1300 విమానాలు రద్దు అయ్యాయి. ఈ ఘటన పట్ల ఇవాళ శ్వేతసౌధం ప్రకటన చేసింది. సైబర్ అటాక్ జరగలేదని వైట్‌హౌజ్ పేర్కొన్నది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ విమాన వ్యవస్థ స్తంభించిపోవడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు వైట్‌హౌజ్ తెలిపింది.
సైబర్ అటాక్ జరిగినట్లు ఆధారాలు లేవని, ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపట్టాలని అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారని, అమెరికా విమాన ప్రయాణికుల భద్రత తమకు ముఖ్యమని వైట్‌హౌజ్ కార్యదర్శి కారిన్ జీన్ పెర్రి తెలిపారు. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత అమెరికా వ్యాప్తంగా విమానాలు గ్రౌండ్ అయ్యాయి.
ఫ్లయిట్అవేర్ ప్రకారం 9600 విమానాలు ఆలస్యం కాగా, మరో 1300 విమానాలు రద్దు అయ్యాయి. ఎందుకు విమాన వ్యవస్థ స్తంభించిపోయిందో స్పష్టంగా తెలియదని బైడెన్ తెలిపారు.