కాలిఫోర్నియా: ఐదేళ్ల వయసు పిల్లలు గొడవ పడితే ఏం జరుగుతుంది. ఒకరినొకరు చేతులతో కొట్టుకుంటారు. ఇంకొంచెం ముందుకెళ్లి ఒకరి ముఖాన్ని ఒకరు గిచ్చుకుంటారు. మహా అయితే చేతిలో ఏది ఉంటే దాన్ని ఎదుటి వారిపై విసిరికొడతారు. అంతేతప్ప ఆ గొడవ విషాదాంతం అయ్యే అవకాశం మాత్రం ఉండదు. కానీ, ఓ ఇంట్లో ఐదేళ్ల వయసున్న కవల సోదరుల మధ్య జరిగిన కొట్లాట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని శాంటాక్రజ్ కౌంటీలోని ఓ ఇంట్లో ఐదేళ్ల వయసున్న ఇద్దరు కవల సోదరులు గొడవపడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు, గుద్దుకున్నారు, తన్నుకున్నారు. ఆ గొడవ అంతటితో ఆగక కత్తులతో పొడుచుకుని ప్రాణాలు కోల్పేయేదాకా వచ్చింది. ఇద్దరిలో ఓ బాలుడు వంటింట్లో కూరగాయలు కోసే చిన్న కత్తిని తీసుకొచ్చి తన కవల సోదరుడిపై దాడికి పాల్పడ్డాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కవల సోదరుల తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హత్యచేసిన బాలుడికి తాను చేసేది నేరం తెలియదు కాబట్టి అతనిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. కాగా, రెండు కళ్లలాంటి తమ పిల్లలకు ఎదురైన ఈ దుస్థితిని తట్టుకోలేక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.