లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు ఆగడం లేదు. వరుసగా రెండో రాత్రి కూడా అక్కడి అడవులు అంటుకున్నాయి. దీంతో తీవ్ర నష్టం జరిగింది. అయిదు ప్రదేశాల్లో దావానలం చెలరేగుతున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఈ కార్చిచ్చు వల్ల అయిదుగురు మృతిచెందారు. అయిదు చోట్ల మంటల వల్ల సుమారు 27 వేల ఎకరాల అడవి దగ్ధం అవుతున్నది. పాలిసేడ్స్, ఈటాన్ వద్ద భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ రెండు చోట్ల మంటల్ని ఆర్పడం ఇబ్బందిగా మారింది.
శాన్ ఫెర్నాండో వ్యాలీలో మాత్రం కార్చిచ్చును అదుపు చేయడంలో అగ్నిమాపక సిబ్బంది సక్సెస్ అయ్యింది. ఈటాన్ సిటీలో అయిదుగురు మృతిచెందారు. నగరం నుంచి సుమారు 1.37 వేల మంది ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రునియన్ కానియన్ వద్ద దావానలం వ్యాపించడంతో.. హాలీవుడ్ కొండల్లోని వీధులన్నీ రద్దీగా మారాయి. జనం భయంతో పరుగులు తీస్తున్నారు. అనేక మంది హాలీవుడ్ సెలబ్రిటీల ఇండ్లు కూడా దగ్ధం అయ్యాయి.
కాలిఫోర్నియా భారీ విపత్తు చోటుచేసుకున్నట్లు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఫెడరల్ నిధుల్ని రిలీజ్ చేసే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం కాచిన లేదా బాటిల్ నీళ్లను మాత్రమే సేవించాలని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంత ప్రజలకు అధికారులు సూచన చేశారు. నీటి కొరత ఏర్పడడంతో… స్విమ్మింగ్ పూల్స్, చెరువల నుంచి నీటి తోడి మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటల్లో నటి పారిస్ హిల్టన్ ప్రాపర్టీ దగ్దమైంది.