Fire Accident in US | అమెరికాలో ఓ అక్కా తమ్ముళ్లు సాహసం చేశారు. న్యూయార్క్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. న్యూయార్క్ సిటీలోని ఈస్ట్ విలేజ్‌లో జాకబ్ రియిస్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా నాలుగో అంతస్తులోకి మంటలు వ్యాపించాయి. అన్ని వైపుల నుంచి మంటలు చుట్టుముట్టడంతో ఆ అంతస్తులో అక్కా తమ్ముళ్లు చిక్కుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ భవనానికి గల కిటికీ ద్వారా ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు.
అగ్నిప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రమాదమే అయినా కిటికీకి వేలాడుతూ పక్కనే ఉన్న పైప్‌ను పట్టుకుని క్షేమంగా కిందకు దిగారు. ప్రస్తుతం ఈ ఘటన దృశ్యాలు ఇంటర్నెట్లో వైరలయ్యాయి. ప్రమాదం సమయంలో ఇతరుల సాయం కోసం వేచి చూడకుండా చాకచక్యంగా.. తెలివిగా బయటపడిన అక్కా తమ్ముళ్లను నెటిజన్లు అభినందనల్లో ముంచెత్తారు. నిజమైన హీరోలు అంటూ ప్రశంసిస్తున్నారు.