Skydive Suicide | లండన్, మే 27 : ప్రియుడితో బ్రేకప్ అయిన మరుసటి రోజే యూకేకు చెందిన మహిళా స్కైడైవర్ 10,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ కింద పడి మరణించారు. పారాచూటింగ్లో 450కిపైగా జంపింగ్‌ల అనుభవం ఉన్న జేడ్ డమారెల్.. స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగానే పారాచూట్‌ను తెరవలేదని అధికారులు అనుమానిస్తున్నారు. డుర్హాం కౌంటీలోని షాటన్ కొలియరీలో ఈ ఘటన జరగింది. ఘటనా స్థలికి చేరుకున్న అత్యవసర బృందాలు ఆమె స్పాట్లోనే మృతి చెందినట్టు నిర్ధారించాయి. స్కైడైవర్ కూడా అయిన 26 ఏండ్ల ప్రియుడితో ఆమె గత ఆరు నెలలుగా డేటింగ్లో ఉంటూ సహజీవనం చేస్తున్నది.
అయితే వీరిద్దరి రిలేషన్షిప్ విచ్ఛిన్నం అయిన మరునాడే ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే తొలుత దానిని ప్రమాదంగా భావించినా ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా స్కై హై సంస్థ తెలిపింది. ఆమె పారాచూట్ వైఫల్యం చెందే అవకాశాలు ఏమీ కన్పించ లేదని, ఆమె కావాలనే పారాచూట్ తెరుచుకునే బటన్‌ను నొక్కకుండా ఈ చర్యకు పాల్పడినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. జేడ్ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, బహుశా ప్రియుడితో బ్రేకప్ కారణంగానే ఆమె ఈ చర్యకు పాల్పడి ఉంటుందని ఆమె స్నేహితురాలు తెలిపింది.