Blue Origin | వాషింగ్టన్, ఏప్రిల్ 14: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన ‘బ్లూ ఆరిజన్’ సంస్థ మహిళా సెలబ్రిటీలతో చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అమెరికన్ గాయని కెటీ పెర్రీ, ప్రముఖ జర్నలిస్ట్ గేల్ కింగ్, జెఫ్ బెజోస్‌కు కాబోయే భార్య లారెన్ శాంచెజ్ సహా ఆరుగురు మహిళలు రోదసిలోకి వెళ్లి అక్కడ 10 నిమిషాలపాటు భార రహిత స్థితిని ఆస్వాదించారు. సోమవారం బ్లూ ఆరిజన్ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ రాకెట్ ప్రయోగం ద్వారా వారంతా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు.
పశ్చిమ టెక్సాస్ నుంచి ప్రయోగించిన న్యూ షెపర్డ్ రాకెట్, వ్యోమగాముల్ని భూ ఉపరితలానికి 106 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లింది. అనంతరం వ్యోమనౌక పారాషూట్ల సాయంతో తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ రోదసి యాత్రలో భాగమైన వారంతా మహిళలే కావటం విశేషం. రోదసి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘బ్లూ ఆరిజిన్’ ఈ రాకెట్ ప్రయోగం చేపట్టినట్టు తెలుస్తున్నది. ‘బ్లూ ఆరిజిన్’ సంస్థకు ఇది 11వ మానవ సహిత రోదసి యాత్ర.