Sperm Race | లాస్ ఏంజెల్స్ : ప్రపంచంలోనే మొట్టమొదటి స్పెర్మ్ రేస్‌కు లాస్ ఏంజెల్స్ ఈ నెల 25న ఆతిథ్యం ఇవ్వబోతున్నది. పురుషుల్లో సంతానోత్పత్తి రేటు తగ్గిపోతుండటంపై అవగాహన కల్పించేందుకు స్పెర్మ్ రేసింగ్ అనే స్టార్టప్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. హాలీవుడ్ పల్లాడియంలో జరిగే పోటీకి దాదాపు 1,000 మంది హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమంలో వీర్యం నమూనాలు స్త్రీల పునరుత్పత్తి వ్యవస్థ మాదిరిగా తయారు చేసిన మైక్రోస్కోపిక్ రేస్ ట్రాక్‌పై హై రిజల్యూషన్ ఇమేజింగ్ ద్వారా ప్రత్యక్షంగా పోటీ పడతాయి.
ఈ పందెంలో రెండు వీర్య నమూనాలు 20 సెంటీమీటర్ల పొడవైన రేస్ట్రాక్లో ఈదుతాయి. మానవ వీర్యం సాధారణంగా ఒక నిమిషానికి సుమారు 5 మిల్లీమీటర్ల వేగంతో ఈదుతుంది. కాబట్టి ఈ పందెం కొన్ని నిమిషాల నుంచి ఓ గంట వరకు ఉంటుంది. అత్యాధునిక ఇమేజింగ్‌ను ఉపయోగించి ఏ నమూనా వీర్యం ఫినిష్ లైన్‌ను ముందుగా చేరుకున్నదీ గుర్తిస్తారు. గడచిన 50 ఏళ్లలో గ్లోబల్ స్పెర్మ్ కౌంట్స్ 50 శాతానికిపైగా క్షీణించినట్లు ఈ పందెం నిర్వాహకులు చెప్పారు.