Green Card | న్యూయార్క్: ‘దొంగ తాళి కట్టేయ్.. గ్రీన్ కార్డు పట్టేయ్’ సంస్కృతి అగ్రరాజ్యంలో పెరిగిపోతుండటం పట్ల ఆ దేశ అధికార యంత్రాంగంలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. వలస ప్రయోజనాలు పొందడానికి దొంగ పెండ్లిండ్లు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా ప్రభుత్వం అటువంటి వారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘనే కాక, మొత్తం వలస విధాన వ్యవస్థ సమగ్రత, విశ్వసనీయతనే దెబ్బతీస్తుందని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘కేవలం అమెరికా పౌరసత్వం కోసమే ఇలా నకిలీ వివాహాలు చేసుకోవడం నేరం. అలాంటి వారికి దేశ బహిష్కరణ, అరెస్ట్, భారీ జరిమానాలు తప్పవు’ అంటూ ఎక్స్‌లో హెచ్చరించింది.
అమెరికన్ చట్టాల ప్రకారం అమెరికా పౌరులు లేదా పర్మినెంట్ రెసిడెంట్లను విదేశీయులెవరైనా వివాహం చేసుకుంటే వారికి గ్రీన్‌కార్డు లేదా న్యాయపరమైన హోదా లభిస్తుంది. అయితే ఇటీవల ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసం ఈ నిబంధనలను కొందరు తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు దిగుతున్నారు. దీనిని కొందరు అక్రమార్జనకు సైతం వినియోగించుకుంటున్నారు. అలాంటి వారు పెద్దయెత్తున డబ్బు తీసుకుని దొంగ పెళ్లిళ్లు చేసుకుంటున్నట్టు యూఎస్సీఐఎస్ నిర్ధారించింది.