పారిస్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యాతో కలిసి ఉమ్మడిగా చేపట్టనున్న మార్స్ మిషన్ ఎక్సోమార్స్ను నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ జోసెఫ్ అష్బాచెర్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఈఎస్ఏ అంతరిక్ష కార్యక్రమాలపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం గురించి తమ సభ్య దేశాలు గత రెండు రోజులుగా చర్చించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యాతో కలిసి ఈ ఏడాది సెప్టెంబర్లో చేపట్టాల్సిన ఎక్స్మార్స్ ప్రయోగాన్ని నిలిపివేయాలని నిర్ణయించామని చెప్పారు. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ అవసరమైనది కూడా అని పేర్కొన్నారు. అలాగే ఈ ప్రయోగంపై ముందుకు వెళ్లే మార్గాలపై సమాలోచన చేస్తామని ఆయన వెల్లడించారు.
కాగా, ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికాతోపాటు ఐరోపా దేశాలు పలు ఆంక్షలు విధించాయి. ఇందులో భాగంగా రష్యాకు అంతరిక్ష సాంకేతిక సహకారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. అలాగే రష్యాతో కలిసి అంతరిక్ష ప్రయోగాలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిలిపివేసింది. దీంతో ప్రెంచ్ గయానా అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రష్యా అంతరిక్ష, సాంకేతిక బృందాన్ని రోస్కాస్మోస్ వెనక్కి రప్పించింది.