వాషింగ్టన్: కరోనా ఊబి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అమెరికా, ఐరోపా దేశాలను ఉద్యోగ సంక్షోభం భయపెడుతున్నది. అదే ‘ది గ్రేట్ రెజిగ్నేషన్’. కరోనా సంక్షోభం పేరు చెప్పి ఉద్యోగులను కొన్ని కంపెనీలు నిర్దాక్షిణ్యంగా వదిలించుకున్నాయి. ఈ పోకడ అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో మరీ ఎక్కువగా కొనసాగింది. ఏడాది గడిచింది. వైరస్ ఉద్ధృతి తగ్గి వ్యాపారాలు గాడినపడ్డాయి. అయితే, కష్ట సమయంలో తమను నట్టేట ముంచిన కంపెనీల్లో తిరిగి చేరేందుకు ఉద్యోగులు ఇప్పుడు సిద్ధంగా లేరు. ఎక్కువ వేతనాలు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. వాళ్ల వైఖరి మారడంలేదు. అదే ‘ది గ్రేట్ రెజిగ్నేషన్’ సంక్షోభానికి దారితీసింది. హెల్త్‌కేర్, రిటైల్ రంగాల్లో ‘ది గ్రేట్ రెజిగ్నేషన్’ ప్రభావం ఎక్కువగా ఉంది.