వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. జార్జియా రాష్ట్రంలోని ఫుల్టన్ కౌంటీ జైలులో సరెండర్ కానున్నారు. గురువారం రోజున ఆయన లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. 2020 దేశాధ్యక్ష ఎన్నికల్లో .. జార్జియా రాష్ట్ర ఫలితాలను మార్చేందుకు ట్రంప్ ప్రయత్నించినట్లు ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసులో ట్రంప్‌తో పాటు మరో 18 మంది ఆగస్టు 25వ తేదీలోపు లొంగిపోవాలని గతంలో జడ్జి ఆదేశించారు. అయితే స్వచ్ఛంధంగా ట్రంప్‌తో పాటు మరో 18 మంది కూడా సరెండర్ అయ్యేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జైలులో సరెండర్ అయ్యే అంశాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించారు. మీరు దీన్ని నమ్మలేరని, గురువారం అట్లాంటా వెళ్తున్నానని, అక్కడ తనను అరెస్టు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.
మరోవైపు జైలు అధికారులతో ట్రంప్ లాయర్లు చర్చలు జరిపారు. సుమారు రెండు లక్షల డాలర్ల బెయిల్‌పై ఆయన్ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేని ట్రంప్.. ఆ ఫలితాలను మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆయనపై నేరాభియోగాలు నమోదు అయిన విషయం తెలిసిందే. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రచారం నిర్వహిస్తున్న ట్రంప్.. ఇప్పటి వరకు నాలుగు క్రిమినల్ కేసులతో లింకు ఉన్న 91 అభియోగాలను ఎదుర్కొంటున్నారు.