H1-b Visa | వాషింగ్టన్, మార్చి 20: వలస విధానాలను సమూలంగా మార్చేయాలనుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల జారీలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వీసా జారీ ప్రక్రియ కోసం సరికొత్త వ్యవస్థను అమలుజేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 20 నుంచి వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్‌వే వీసా వ్యవస్థలో పాత రికార్డులు, దరఖాస్తులను తొలగించనుంది. దీంతో హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. తాజా ఆదేశాల ప్రకారం, మార్చి 20 నుంచి ఐదేండ్ల కంటే పాతవైన అన్ని రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. అంటే..ఉదాహరణకు ఓ దరఖాస్తుకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఐదు సంవత్సరాల కంటే పాతవైన వీసాల రికార్డులన్నింటినీ మార్చి 19లోగా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలను ఇప్పటికే ఆదేశించారు. లేదంటే ఆ రికార్డులను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నది.
లేబర్ కండిషన్ అప్లికేషన్స్, శాశ్వత లేబర్ సర్టిఫికెట్ అప్లికేషన్లపై ఈ తొలగింపు ప్రభావం పడనున్నదని ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీచేసింది. త్వరలోనే వీసాల జారీ కోసం యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం కొత్త దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనున్నది. దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ సర్కార్ వెల్లడించింది. ఈ ఏడాది నుంచి హెచ్-1బీ వీసాల జారీలో అమెరికా కొత్త విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై ఒక లబ్దిదారు బహుళ దరఖాస్తులు చేసుకున్నా..ఒకే అప్లికేషన్‌గా పరిగణించనున్నారు. లాటరీ విధానంలో అనుచిత ప్రయోజనం పొందకుండా అడ్డుకునేందుకు తాజా నిబంధనలు తీసుకొచ్చారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దుల పద్దులో తాజాగా విద్యాశాఖ కూడా చేరింది. ఎన్నికల్లో చేసిన వాగ్దానంలో భాగంగా చిరకాలంగా ఎదురు చూస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రద్దు కార్యనిర్వాహక ఉత్తర్వుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నట్టు శ్వేత సౌధం వర్గాలు తెలియజేశాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఉదారవాద భావాలతో విద్యా శాఖ కలుషితమైందని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. దానికి తోడు వ్యయాల తగ్గింపులో భాగంగా దీనిని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే ట్రంప్ ఈ ఉత్వర్వులపై సంతకం చేయకుండానే దీనిని సవాల్ చేస్తూ డెమోక్రాట్లు అధికారంలో ఉన్న స్టేట్ అటార్నీ జనరల్స్ న్యాయస్థానాలను ఆశ్రయించారు..
కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ఈ శాఖను మూసివేయలేరని, అది కష్టసాధ్యమని కొందరు పేర్కొంటున్నారు. ఎందుకంటే సెనేట్‌లో రిపబ్లికన్లకు 53-47 ఆధిక్యత ఉంది. అయితే కేబినెట్ స్థాయి సంస్థను తొలగించాలంటే కనీసం 60 ఓట్లు ఉండాలి. అయితే ఇక్కడ రిపబ్లికన్లకు మెజారిటీ ఉండదు. 7 ఓట్లు తగ్గుతాయి.