న్యూఢిల్లీ, జనవరి 12: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో ప్రకటించుకున్నారు. దీంతో చమురు సంపన్న దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో అమెరికా పాత్ర మరోసారి చర్చనీయాంశంగా మారింది. ట్రూత్ సోషల్‌లో ఆదివారం ట్రంప్ తన అధికారిక హోదాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు, 2026 జనవరి నుంచి అని ప్రకటించుకుంటూ అమెరికాకు 45వ, 47వ అధ్యక్షుడు, 2025 జనవరి 20 నుంచి అని కూడా తెలియచేశారు. వెనెజువెలాపై భారీ స్థాయిలో సైనిక దాడి జరిపిన కొన్ని వారాల తర్వాత ట్రంప్ తన అధికారిక హోదాను అనూహ్యంగా ఈ విధంగా ప్రకటించారు.
అమెరికా దళాలు తమ సైనిక ఆపరేషన్‌లో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియా ఫోరెస్ని అరెస్టు చేసి న్యూయార్క్‌కు తరలించాయి. ప్రస్తుతం వారిద్దరూ నార్కో-టెర్రరిజం అభియోగాలను అమెరికాలో ఎదుర్కొంటున్నారు. సురక్షితమైన, సరైన, న్యాయపరమైన అధికార మార్పిడి జరిగే వరకు వెనెజువెలా పాలనను అమెరికా పర్యవేక్షిస్తుందని ట్రంప్ సైనిక ఆపరేషన్ తర్వాత ప్రకటించారు. మరో నాయకత్వ శూన్యత ఏర్పడడం వెనెజువెలా ప్రయోజనాలకు హాని చేయగలవని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. మదురో పదవీచ్యుతి అనంతరం వెనెజువెలా ఉపాధ్యక్షురాలు, చమురు మంత్రి డెల్సీ రోడ్రిగ్స్ గత వారం ఆపద్ధర్మ అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు.
అయితే వెనెజువెలా ఆపద్ధర్మ ప్రభుత్వం అమెరికాకు 3 నుంచి 5 కోట్ల బ్యారెళ్ల అత్యంత నాణ్యతతో కూడిన చమురును అప్పగిస్తుందని కూడా ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూరే విధంగా డబ్బు లావాదేవీలను అమెరికా ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన వెల్లడించారు. వెంటనే ఈ ప్రణాళికను అమలు చేసే బాధ్యతలను ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్‌కు అప్పగించిన ట్రంప్ వెనెజువెలా నుంచి చమురును అమెరికా రేవులకు నౌకల ద్వారా తరలించాలని ఆదేశించారు. త్వరలోనే క్యూబాకు చమురు సరఫరా, ఆర్థిక సహాయాన్ని నిలిపివేయనున్నట్లు కూడాట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ తన సోషల్ మీడియాలో తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నప్పటికీ ఇది వికిపీడియాలో కాని ఇతర పబ్లిక్ రికార్డుల్లో కూడా ఇప్పటివరకు చోటుచేసుకోలేదు.