వాషింగ్టన్, సెప్టెంబర్ 16 : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఆయన గోల్ఫ్ ఆడుతుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపేందుకు విఫలయత్నం చేశాడు. ఆదివారం ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ వద్ద ఉన్న ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. రక్షణ కంచె వద్ద నుంచి దుండగుడు ట్రంప్ లక్ష్యంగా ఏకే-47 తుపాకీ గురిపెట్టాడు. ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దుండగుడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు కారులో పారిపోగా, ఏజెంట్లు వెంబడించి అరెస్టు చేశారు. ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం రెండు నెలల్లో ఇది రెండోసారి. జూలైలో పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
ట్రంప్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడిని హవాయ్‌కు చెందిన ర్యాన్ వెస్లీ రౌత్(58)గా భద్రతా సంస్థలు గుర్తించాయి. నార్త్ కరోలినాలో రౌత్‌కు పెద్ద నేరచరిత్ర ఉన్నట్టు ప్రాథమికంగా తేలింది. అతడు ట్రంప్ వ్యతిరేకి అని స్థానిక మీడియా పేర్కొన్నది.
హత్యాయత్నం ఘటనపై ట్రంప్ స్పందించారు. ‘నా సమీపంలో కాల్పులు జరిగాయి. నేను సురక్షితంగా ఉన్నా. నన్ను ఏదీ నిలువరించలేదు. నేను ఎప్పటికీ లొంగను’ అని ఆయన పేర్కొన్నారు. తన ప్రాణాలు కాపాడిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖండించారు.