న్యూయార్క్: డైర్ జాతికి చెందిన తోడేళ్లను జన్యు ఇంజినీరింగ్ పద్ధతిలో పునర్ సృష్టించారు. సుమారు పది వేల ఏళ్ల క్రితమే ఈ తోడేళ్లు అంతరించినట్లు తెలుస్తోంది. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా పుట్టిన డైర్ జాతి కూనలకు చెందిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ఆ తోడేళ్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మూడు నుంచి ఆర్నెళ్ల మధ్య వయసున్నాయి. తెలుపు రంగు జట్టు, బలమైన దవడ ఉన్న ఆ జంతువులు ఒక్కొక్కటి 80 పౌండ్లు ఉన్నాయి. పెరిగే కొద్దీ ఇవి సుమారు 140 పౌండ్ల బరువు చేరుకునే అవకాశం ఉన్నట్లు కొలోసల్ బైయోసైన్సెస్ సంస్థ తెలిపింది.
డైర్ జాతి తోడేళ్లు పది వేల ఏళ్ల క్రితం అంతరించనట్లు ఆ కంపెనీ చెప్పింది. డైర్ జాతి తోడేళ్లు.. గ్రే కలర్ తోడేళ్ల కన్నా పెద్ద సైజులో ఉంటాయి. అంతరించిన జాతి తోడేళ్ల నుంచి జన్యు ఇంజినీరింగ్ ద్వారా పునర్ సృష్టించినట్లు బఫెలో యూనివర్సిటీ బయాలజిస్టు విన్సెంట్ లించ్ తెలిపారు. అమెరికా నేలపై ఈ భారీ జంతువులు ఒకప్పుడు సంచరించినట్లు భావిస్తున్నారు. అయితే ఒహియాలో దొరికిన 13 వేల ఏళ్ల క్రితంనాటి డైర్ జాతి తోడేలు దంతం, ఇడహోలో దొరికిన 72 వేల ఏళ్ల క్రితం నాటి తోడేళ్లు పుర్రెను పరిశోధకులు స్టడీ చేసి డైర్ తోడేళ్లను సృష్టించారు. ప్రస్తుతం జీవిస్తున్న ఓ గ్రే కలర్ తోడేలు రక్తం కణాలను తీసి . సీఆర్ఐఎస్పీఆర్ ద్వారా జన్యు మార్పిడి చేశారు. దీనిపై డల్లాస్ ఫార్మా కంపెనీ కొలోసల్ బయోసైన్సెస్ సంస్థ చీఫ్ సైంటిస్టు బెత్ షాపిరో వివరణ ఇచ్చారు.