Dhruv Rathee : ధ్రువ్ రాఠీ.. యూట్యూబ్, సోషల్ మీడియాను ఫాలో అయ్యేవాళ్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వివాదాస్పద అంశాలతో వీడియోలు చేస్తూ గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఇండియాపై, ఇక్కడి పార్టీలపై, సిద్ధాంతాలపై నిత్యం విమర్శలు చేస్తూ వీడియోలు చేయడం అతడి ప్రత్యేకత. అయితే, ఇప్పుడు ధ్రువ్ రాఠీపైనే సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం మొదలైంది.
అది కూడా అతడి వ్యక్తిగత జీవితంపై. అతడు తన భార్య జూలీని మోసం చేశాడని పలు సోషల్ మీడియా అకౌంట్లలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అతడిపై చాలా మంది మరిన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్రువ్ రాఠీ స్పందించాడు. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో విడుదల చేశాడు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని అతడు ఖండించాడు. కొంతమంది తన ఇమేజ్ దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించాడు. తనను లక్ష్యంగా చేసుకుని కావాలనే ఇలా చేస్తున్నారని, అవేవీ నమ్మశక్యంగా లేవని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన స్థాయి తగ్గించాలనుకుంటే ఇలా ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేయకుండా, మరింత కష్టపడాలని సూచించాడు.
ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోదల్చుకోలేదని, తన స్థాయిని ఇవి తగ్గించలేవని చెప్పాడు. అయితే, తనపై వచ్చిన రూమర్స్ విషయంలో కచ్చితమైన వివరణ మాత్రం ఇవ్వలేదు. మరోవైపు అతడి భార్య జూలీ కూడా ఈ ప్రచారంలో నిజం లేదనిపించేలా ఒక పోస్ట్ చేసింది. ధ్రువ్ రాఠీ, జర్మనీకి చెందిన జూలీని 2022లో వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల డేటింగ్ అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు వారికి ఒక బాబు ఉన్నాడు.