Cancer Vaccine | న్యూయార్క్, అక్టోబర్ 18: క్యాన్సర్ వ్యాధి చికిత్స దిశగా అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ప్రాణాంతక క్యాన్సర్‌ను నివారించే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్‌ను వీరు అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ. కొలి బ్యాక్టీరియాను మార్చి ఈ వ్యాక్సిన్‌లో ఉపయోగించారు. క్యాన్సర్ కణాలపై దాడి చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను ఈ ప్రొబయోటిక్ బ్యాక్టీరియా సిద్ధం చేస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఈ వ్యాక్సిన్ శరీరంలో బ్యాక్టీరియా నియోయాంటిజెన్స్ అనే ప్రొటీన్ లక్ష్యాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను పోలి ఉంటాయి. క్యాన్సర్ కణాలను గుర్తించి, దాడి చేసేలా రోగ నిరోధక వ్యవస్థను నియోయాంటిజెన్లు సిద్ధం చేస్తాయి. ఒకవేళ శరీరంలోని లక్ష్యాన్ని గుర్తించడంలో విఫలమైతే ఈ వ్యాక్సిన్‌ను వెంటనే శరీరం నుంచి తొలగించవచ్చని, తద్వారా రోగ నిరోధక వ్యవస్థకు నష్టం ఉండదని పరిశోధకులు తెలిపారు.
ప్రీక్లినికల్ ప్రయోగాల్లో భాగంగా ఎలుకలపై ఈ వ్యాక్సిన్‌ను పరీక్షించారు. అడ్వాన్స్డ్ కొలొరెక్టల్ క్యాన్సర్‌తో పాటు మెలనొమా(చర్మ క్యాన్సర్)కు సంబంధించిన కణాలు వృద్ధి చెందకుండా, పూర్తిగా నిర్మూలించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్‌కు ఉన్నట్టు తేలిందని పరిశోధకులు చెప్పారు. తద్వారా భవిష్యత్తులో మళ్లీ క్యాన్సర్ తిరగబడకుండా చూడొచ్చని చెప్తున్నారు. పెప్టైడ్ ఆధారిత క్యాన్సర్ వ్యాక్సిన్ల కంటే బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ సమర్థంగా పని చేయగలదని తెలిపారు.
రోగిలో ఉన్న నిర్దిష్ట క్యాన్సర్ రకానికి తగ్గట్టుగా ఈ వ్యాక్సిన్‌ను మార్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెప్పారు. ముందుగా రోగి కణతి లక్షణాలను గుర్తించి, దానికి తగ్గ ప్రత్యేకమైన నియోయాంటిజెన్లను ఉత్పత్తి చేసేలా బ్యాక్టీరియాను మార్చాల్సి ఉంటుందని తెలిపారు. సాధారణంగా క్యాన్సర్ కణాలు పరివర్తన చెందుతూ ఉంటాయి. క్యాన్సర్ చికిత్సలో ఇదే అతి పెద్ద ఆటంకం. పెద్ద సంఖ్యలో నియోయాంటిజెన్లను ఉత్పత్తి చేయడం ద్వారా క్యాన్సర్ కణాలు పరివర్తన చెంది రోగ నిరోధక వ్యవస్థను తప్పించుకోకుండా ఈ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని పరిశోధకులు చెప్పారు.