Israel Hezbollah War | జెరూసలేం, సెప్టెంబర్ 29: లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్బొల్లాకు మరో భారీ షాక్ తగిలింది. ఇజ్రాయెల్ దాడిలో మరో కీలక నేత మృతిచెందాడు. శనివారం తాము జరిపిన దాడిలో హెజ్బొల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్ హతమైనట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హెజ్బొల్లా కూడా కౌక్ మృతిని ధ్రువీకరించింది. గత వారం రోజుల్లో ఇజ్రాయెల్ దాడిలో సంస్థ చీఫ్ నస్రల్లా సహా ఏడుగురు టాప్ కమాండర్లు మృతిచెందారు. అయితే ఆదివారం కూడా బీరుట్లో మరో లక్షిత దాడిని జరిపినట్టు జజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. అలాగే యెమెన్‌లోని హౌతీ స్థావరాలపైనా దాడులు చేసినట్టు తెలిపింది. ముఖ్యంగా హూడెయిడా పోర్టు సిటీలో పవర్ ప్లాంట్లు, సీపోర్టు లక్ష్యంగా వైమానిక దాడులు చేసినట్టు వెల్లడించింది.
హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను లక్షిత దాడుల్లో ఇజ్రాయెల్ దళాలు చంపడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక ఇరానీ గూఢచారి ఇచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకునే ఇజ్రాయెల్ వాయుసేన పక్కా ప్రణాళికతో అండర్‌గ్రౌండ్ బంకర్లో ఉన్నప్పటికీ అతడిని హతమార్చినట్టు ఫ్రెంచ్ వార్తాపత్రిక లే పారిసియన్ తెలిపింది. బీరుట్‌లోని ఒక భవనంలో ఉపరితలానికి 60 అడుగుల కింద ఉన్న అండర్‌గ్రౌండ్‌లో అగ్రనేత సమావేశమవుతున్నట్టు ఇజ్రాయెల్‌కు సమాచారం వచ్చిందని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ వాయుసేన సుమారు 80 టన్నుల పేలుడు పదార్థాలతో పాటు బంకర్లను సమూలంగా ధ్వంసం చేసే 85 ‘బంకర్-బస్టర్’ బాంబులు (ఒక్కొక్కటి 907 నుంచి 1814 కేజీల బరువు) వినియోగించింది. ఇవి ఆరు మీటర్ల కాంక్రీట్ లేదా 30 అడుగుల భూమి లోపలి వరకు పోయి విధ్వంసం సృష్టించగలవు. ఇంటెలిజెన్స్, మిలటరీని సమన్వయం చేసుకుంటూ ఆ దేశ 69 స్కాడ్రన్ వాయుసేన బృందం నస్రల్లాను హతమార్చే ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించింది.
హెజ్బొల్లాకు 32 ఏండ్లుగా సారథ్యం వహిస్తూ వచ్చిన నస్రల్లా మరణంతో అతని వారసునిగా హషీమ్ సఫీద్దీన్‌ను ఎంపిక చేయవచ్చునని భావిస్తున్నారు. శుక్రవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇతను కూడా నస్రల్లాతో మరణించినట్టు తొలుత వార్తలొచ్చాయి. అయితే తర్వాత అది నిజం కాదని నిర్ధారణ అయ్యింది. 1964లో జన్మించిన సఫీద్దీన్ మిలటరీ ఆపరేషన్లలో ఆరితేరిన వ్యక్తి. ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ సంతతని సూచించేలా నల్లటి తలపాగాను ధరించి మతగురువుగా కన్పిస్తాడు. ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలు చూస్తూ జిహాద్ కౌన్సిల్ గ్రూపుల సభ్యునిగా ఉన్న సఫీద్దీన్.. నస్రల్లా కజిన్ కూడా.
2017లోనే ఇతడిని అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. నస్రల్లా కూడా ఇతనికి సంస్థలో వివిధ హోదాలు కట్టబెట్టి అతడిని నేతగా తయారు చేశారు. అతని భౌతిక తీరు, ప్రవర్తన కూడా నస్రల్లాను పోలి ఉంటుంది. అతను తరచూ చేసే ప్రకటనలు పాలస్తీనా అనుకూల, హెజ్బొల్లా విధానాలను స్పష్టం చేసేవి. 2020లో వివాహమైన అతని కుమారుడు రిదా అదే ఏడాది బాగ్దాద్‌పై అమెరికా జరిపిన వాయుసేన దాడిలో మరణించాడు. 2006లో ఇజ్రాయెల్ దాడుల సందర్భంగా నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లగా, సఫీద్దీనే సంస్థ కార్యక్రమాలకు ప్రతినిధిగా హాజరయ్యేవాడు.
నిఘా వ్యవస్థలు అందిస్తున్న కీలక సమాచారం లెబనాన్‌లో ఇజ్రాయెల్ లక్షిత దాడులకు ఎంతో ఉపయోగపడుతున్నట్టు న్యూయార్క్ టైమ్స్ కూడా పేర్కొంది. ఇజ్రాయెల్ ఇదంతా గత కొన్ని ఏండ్లుగా అమలు చేస్తున్న పక్కా ప్రణాళిక వల్లే సాధ్యమైంది. హెజ్బొల్లా వ్యూహాలు, నేతల కదలికలను ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నది. ఇజ్రాయెల్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 8200 ద్వారా అత్యాధునిక సైబర్ టూల్స్‌ను వినియోగిస్తూ హెజ్బొల్లా సెల్ఫోన్లు, దాని కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగిస్తూ ఉంది. వీరు తమకు వస్తున్న సమాచారాన్ని తక్షణం ఇజ్రాయెల్ ఆర్మీ, వాయు సేనకు పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు.