ఆల్ఫా కన్నా 10 రెట్లు ఎక్కువ తీవ్రత
న్యూఢిల్లీ, జూలై 30: ఆటలమ్మ(చికెన్ పాక్స్)లాగే డెల్టా వేరియంట్ కూడా అత్యంత ఉద్ధృతంగా వ్యాపించగల లక్షణాలు కలిగి ఉన్నదని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) తమ అంతర్గత నివేదికలో పేర్కొన్నది. ఇప్పటివరకు తెలిసిన అన్ని రకాల వైరస్/ మెర్స్, సార్స్, ఎబోలా, ఫ్లూ, స్మాల్ పాక్స్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుందని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. కరోనా ఇతర వేరియంట్ల కన్నా డెల్టా వేరియంట్ ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. వ్యాధి తీవ్రత పెరుగుతుంది. ఆల్ఫా వేరియంట్‌తో పోల్చితే డెల్టా కారణంగా వాయునాళాల్లో వైరస్ లోడ్ పది రెట్లు ఎక్కువగా పెరుగుతున్నది. టీకా వల్ల లభించిన ఇమ్యూనిటీని తట్టుకొని సైతం ఇది హాని చేస్తున్నది. వ్యాక్సిన్‌తో సంబంధం లేకుండా గొంతు, ముక్కులో వైరల్ లోడ్ పెరుగుతున్నదని ఈ నివేదిక తెలిపింది.