న్యూఢిల్లీ : అమెరికా వీసా కలను సాకారం చేసుకోవడానికి ఏడాదికిపైగానే వేచి చూడవలసి వస్తున్నది. ఈ పరిస్థితి విద్యార్థులకు మాత్రమే కాదు, వ్యాపారులు, పర్యాటకులు వంటి ఇతర రంగాల వారికీ ఎదురవుతున్నది. కొన్ని ప్రాంతాల్లో అపాయింట్మెంట్ వెయిట్ టైమ్ ఓ సంవత్సరానికి మించిపోతున్నది. రీషెడ్యూలింగ్ మరింత కఠినమవుతున్నది. ఇక ఇంటర్వ్యూలు అత్యంత సూక్ష్మ వివరాలతో, కఠినతరమయ్యాయి. దేశంలోని పశ్చిమ ప్రాంతాల వారికి వీసా అపాయింట్మెంట్ దొరకాలంటే ఏడాదిన్నర పడుతున్నది లేదా 2026 చివరికి పోతున్నది. దేశంలోని ఉత్తరాది, దక్షిణాది, తూర్పు ప్రాంతాల వారికి దాదాపు ఓ సంవత్సరంలో అపాయింట్మెంట్ దొరుకుతున్నది.
మే నెల నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, అమెరికా వీసా కోసం దరఖాస్తుదారు తనకు కేటాయించిన సమయానికి హాజరుకాలేకపోతే, కొత్త అపాయింట్మెంట్ను 120 రోజుల వరకు బుక్ చేసుకోవడానికి వీలుకాదు. ఇది ఇంటర్వ్యూకు, ఇంటర్వ్యూ-వెయివర్ అపాయింట్‌మెంట్స్‌కు వర్తిస్తుంది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు తమ అపాయింట్మెంట్ను కేవలం ఒకసారి మాత్రమే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. గతంలో రెండుసార్లు రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉండేది.
ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, అపాయింట్మెంట్ జాప్యాలు కొవిడ్-19 మహమ్మారి తర్వాత నుంచి సాధారణమేనని, అయితే, ఇప్పుడు ఈ గడువు ఓ ఏడాదికి మించిపోతున్నదని చెప్పారు. జనవరికి పూర్వం 8-9 నెలలు లేదా ఒక సంవత్సరం పట్టేదని, ఒక ఏడాదిలోగా వీసా వచ్చేదని తెలిపారు. ఇప్పుడు ఈ గడువు ఏడాదికి మించిపోతున్నదని, తిరస్కరణలు కూడా పెరిగిపోతున్నాయని చెప్పారు. అన్ని రకాల ధ్రువపత్రాలు ఉన్న దరఖాస్తుదారులకు కూడా వ్యాపారం, లీజర్ వీసాల తిరస్కరణ జరుగుతున్నదన్నారు. అమెరికాకు తప్పనిసరిగా వెళ్లవలసిన వారు భారత్‌లో వీసా అపాయింట్మెంట్లు దొరకపోవడంతో సింగపూర్, థాయ్‌లాండ్ వెళ్లి, అక్కడి నుంచి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చైనా వంటి దేశాల్లో ఇటువంటి జాప్యాల గురించి తాము వినలేదని, చైనాలో కొద్ది వారాల్లోనే అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోనందువల్ల తాము నిస్సహాయులమైపోతున్నామని తెలిపారు.
కొత్త వీసాలు రావడం సవాలుగా మారిపోయిందని ట్రావెల్స్ ఏజెంట్లు చెప్పారు. పర్యాటకులు వీసా రాకముందే ట్రావెల్స్ వద్ద అమెరికా ట్రిప్‌ను బుక్ చేసుకుని, ఓ నెలలోనే అమెరికా వెళ్లే రోజులు పోయాయన్నారు. అనైతిక ఏజెంట్లపై అమెరికన్ ప్రభుత్వం విరుచుకుపడుతున్నదని విన్నామని, కానీ ఇప్పటికీ జనం వీసా అపాయింట్మెంట్ల కోసం మధ్యవర్తులకు అధికంగా సొమ్ము చెల్లిస్తున్నట్లు వింటున్నామని తెలిపారు. కాగా, అమెరికా వీసా ఇంటర్వ్యూల్లో దరఖాస్తుదారులను అత్యంత పదునైన ప్రశ్నలు అడుగుతున్నారని కొందరు చెప్పారు. ట్రావెల్ ప్లాన్స్, ఎన్ని రోజులు అమెరికాలో ఉంటారు, ఏ ఉద్దేశంతో అమెరికాకు వస్తున్నారు? వంటి ప్రశ్నలు సంధిస్తున్నారన్నారు.