జెరూసలేం: ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు హెర్జి హలేవీ ప్రస్తుతం ఉత్తర ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇంతలో ఆయనకు నిఘా వర్గాల నుంచి ఓ సమాచారం వచ్చింది. ఇది ‘వదులుకోరాని అవకాశం’ అని, తక్షణమే దాడి చేయాలని హెర్జి ఆదేశించారు. అంతే.. వెంటనే ఇజ్రాయెల్ దళాలు బీరుట్‌లోని దహియాహ్ నైబర్‌హుడ్‌లో 8 అంతస్థుల నివాస భవనం పార్కింగ్ స్థలంపై పైకి నాలుగు క్షిపణులను కురిపించాయి. దీంతో భూగర్భంలో 20 మంది కమాండర్లతో సమావేశమైన హెజ్బొల్లా అగ్రస్థాయి ఉగ్రవాది ఇబ్రహీం అకీల్ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.
ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఇంతకీ ఈ నిఘా సమాచారం ఏమిటంటే, అకీల్తోపాటు హెజ్బొల్లాకు చెందిన టాప్ రద్వన్ దళాల ఉగ్రవాదులు సమావేశమయ్యారని, వీరు ఇజ్రాయెల్‌లోని గలీలీ ప్రాంతంపై దాడి చేయడం కోసం చర్చిస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. ఇజ్రాయెల్ తక్షణమే స్పందించి కురిపించిన క్షిపణులు మొదటి భవనాన్ని నేలమట్టం చేసి, రెండో భవనాన్ని చీల్చుకుంటూ భూగర్భంలోకి చొచ్చుకెళ్లి ‘లక్ష్యాన్ని’ పూర్తి చేశాయి.
ఈ దాడిలో అకీల్ సహా 37 మంది మరణించినట్లు, వీరిలో ఏడుగురు మహిళలు, ముగ్గురు బాలలు ఉన్నట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. ఈ ఘటనలో 68 మంది గాయపడగా, 15 మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పింది. ఉగ్రవాదులు తమకు రక్షణ కవచంగా సామాన్యులను ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు.
టాప్ కమాండర్లను మట్టుబెట్టాం: ఐడీఎఫ్
హెజ్బొల్లాకు చెందిన రద్వన్ ఫోర్స్ టాప్ కమాండర్లలో ఇద్దర్ని శుక్రవారం మట్టుబెట్టామని ఇజ్రాయెల్ దళాలు శనివారం ధ్రువీకరించాయి. హెజ్బొల్లా క్షేత్ర స్థాయి సైనిక కార్యకలాపాలను రద్వన్ ఫోర్స్ నిర్వహిస్తుందని చెప్పింది. ఈ దళంలోని అకీల్ టాప్ కమాండర్లలో రెండోవాడని తెలిపింది. ఇతనితోపాటు మరో సీనియర్ కమాండర్‌ను, 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు వివరించింది.