Multivitamin Supplements | న్యూయార్క్, జూన్ 29: ప్రతిరోజూ మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం ఆయుష్షు పెరగడానికి ఉపయోగపడదని, పైగా త్వరగా మరణించే ముప్పుకు కారణం కావొచ్చని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు 1990ల నుంచి 3,90,124 మందిపై దాదాపు 20 ఏండ్ల పాటు అధ్యయనం చేశారు. ఇందుకు సంబధించిన వివరాలు ‘జామా నెట్వర్క్ ఓపెన్’లో ప్రచురితమయ్యాయి.
ఎక్కువ కాలం జీవించడానికి మల్టీవిటమిన్ సప్లిమెంట్లు ఉపయోగపడటం లేదని, మరణ ముప్పును ఏమాత్రం తగ్గించడం లేదని పరిశోధకులు గుర్తించారు. పైగా మల్టీవిటమిన్లు తీసుకోని వారి కంటే తీసుకుంటున్న వారు త్వరగా మరణించే ముప్పు 4 శాతం పెరిగినట్టు తేల్చారు. మల్టీవిటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం కంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిదని డాక్టర్ నీల్ బార్నార్డ్ తెలిపారు.
తీసుకునే ఆహారంలో సూక్ష్మ, అతి సూక్ష్మ పోషకాలు, పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని, సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం కంటే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు తీసుకోవడం మంచిదని మరో పరిశోధకురాలు డాక్టర్ జేడ్ ఏ కోబెర్న్ తెలిపారు. మాంసం, మద్యపానం, ఒకేచోట కూర్చోవడం తగ్గించాలని ఆమె సూచించారు.