హవానా, మే 14 : అమెరికా విధించిన ఆంక్షల ధాటికి.. క్యూబా తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయింది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అడుగంటాయి. దేశ రాజధాని హవానా సహా అన్నిచోట్లా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వం దేశమంతా బ్లాక్ అవుట్ విధించింది. దీంతో వందలాది మంది పౌరులు రోడ్లమీదకు రాగా, బుధవారం హవానాలో పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి.
నిరసనకారులు రోడ్లను దిగ్బంధించి, టైర్లను కాల్చుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హవానాలో రోజుకు 20 నుంచి 22 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. అమెరికా ఆంక్షల వల్లే దేశంలో ఈ పరిస్థితి తలెత్తిందని క్యూబా ఇంధన మంత్రి విసెంటీ లివీ అన్నారు. ‘దేశంలో ముడి చమురు, పెట్రోల్, డీజిల్ సహా అన్నీ అడుగంటాయి. కొంతమేర గ్యాస్‌ను ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం’ అని అన్నారు.