పారిస్: మహ్మద్ ప్రవక్తకు సంబందించి వ్యంగ్య చిత్రాలను చూపించాడనే కోపంతో ఫ్రాన్స్‌లో టీచర్‌ను అత్యంత కిరాతకంగా తలను తెగనరికి చంపిన కేసులో ఫ్రెంచ్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు టీనేజర్లను దోషులుగా ప్రకటించింది. తాను క్లాస్ రూమ్‌లో లేకపోయినప్పటికీ ఉన్నానని అబద్ధం చెప్పి టీచర్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన యువతి కూడా ఈ ఆరుగురు దోషుల్లో ఒకరుగా ఉన్నది.
ఫ్రెంచ్ టీచర్ శామ్యూల్ పాటీ 2020లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య ఫ్రాన్స్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇక హత్య విషయానికి వస్తే.. శామ్యూల్స్ 2020లో తన క్లాసులో భావ ప్రకటనా స్వేచ్ఛపై పాఠం చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన వ్యంగ్య చిత్రాలను చూపించాడని కొందరు విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పడంతో వివాదం చెలరేగింది.
ఆ రోజు మహ్మద్ ప్రవక్త వ్యంగ్య చిత్రాలను చూపించే ముందు టీచర్ శామ్మూల్స్ ముస్లిం విద్యార్థులను బయటికి పంపించాడని ఓ విద్యార్థిని కూడా చెప్పింది. ఈ క్రమంలోనే శామ్యూల్‌పై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెల్లుబికింది. శామ్యూల్స్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో విచారణ జరిపిన ఫ్రెంచ్ కోర్టు.. టీచర్ తమను క్లాస్ నుంచి బయటికి పంపించాడు అని చెప్పిన విద్యార్థిని ఆ రోజు క్లాసులో లేనే లేదని గుర్తించింది. అబద్ధం చెప్పిన ఆమెతోపాటు మొత్తం ఆరుగురు టీనేజర్లను దోషులుగా తేల్చింది.