బీజింగ్, ఏప్రిల్ 28: ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవారు నిరాశ, నిస్పృహ, ఆందోళనకు గురవుతున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. చైనాకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయన ఫలితాన్ని వెలువరించారు. దీన్ని అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ (పీఎన్ఏఎస్) జర్నల్లో ప్రచురించారు. 1,40,728 మందిపై పదకొండేండ్ల పాటు ఈ పరిశోధన కొనసాగింది.
ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నవారు తినని వారితో పోలిస్తే 12 శాతం అధికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉన్నట్టు ఇందులో తేలింది. నిరాశ, నిస్పృహకు 7 శాతం అధికంగా లోనయ్యే ఆస్కారం ఉన్నట్టు వివరించారు. వేయించిన పదార్థాలు తింటున్న వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారా లేక మానసిక ఆందోళనకు గురైనవారు వేయించిన పదార్థాలకు ఆకర్షితులవుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది.