Climate Crisis | వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ప్రస్తుతం ప్రమాదపు చివరి అంచుకు చేరింది. మే 2025 నాటికి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ (CO₂) స్థాయి 430 పార్ట్స్ పర్ మిలియన్ (ppm) ని దాటింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్థాయి. ఇది భూమి ఉష్ణోగ్రతను పెంచడమే కాకుండా సముద్ర జీవుల నుంచి కాలానుగుణ మార్పుల వరకు.. విస్తృత విధ్వంసానికి కారణమవుతోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మే మాసంలో హవాయిలోని మౌనా లోవా అబ్జర్వేటరీలో నిర్వహించిన పరిశీలనలలో వాతావరణ కార్బన్ డయాక్సైడ్ (CO₂) సగటు స్థాయి 430.2 పీపీఎంకు చేరిందని తేలిందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని స్క్రిప్స్ ఓషనోగ్రఫీ ఇన్స్టిట్యూట్, యూఎస్‌లోని నేషనల్ఓషనిక్ అట్మాస్ఫియరిక్ ఇన్స్టిట్యూట్(NOAA) శాస్త్రవేత్తలు ఈ సమాచారాన్ని వెల్లడించారు. వాతావరణంలో ఉన్న CO₂ను పర్యవేక్షించడానికి మౌనా లోవా అబ్జర్వేటరీ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా పరిగణిస్తుంటారు.
నేషనల్ ఓషనిక్ అట్మాస్ఫియర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. ఈ సగటు మే మాసంలో 430.5 పీపీఎంగా నమోదైంది. ఇది మే 2024 నాటి కంటే 3.6 పీపీఎం ఎక్కువ. CO₂ భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రతను పెంచడమే కాకుండా మహాసముద్రాలకు సైతం తీవ్రమైన ముప్పుగా మారింది. CO₂ సముద్రపు నీటిలో కరిగితే అది మరింత ఆమ్లంగా మారుతుంది. ఇది రొయ్యలు, గుల్లలు, పగడాలు వంటి జీవుల పెంకులను బలహీనపరుస్తుంది. సముద్రాల్లో ఆక్సిజన్ మొత్తాన్ని సైతం తగ్గిస్తుంది. ఇది సముద్ర జీవులకు చాలా ప్రాణాంతకం. సంక్షోభానికి ప్రధాన కారణం మానవులే. ఈ సంక్షోభానికి మానవ సమాజమే తప్ప మరెవరూ బాధ్యులు కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. బొగ్గు, డీజిల్, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల అధిక వినియోగం, వేగవంతమైన అటవీ నిర్మూలన, పెరుగుతున్న పారిశ్రామిక ఉత్పత్తి, అనియంత్రిత రవాణా వ్యవస్థ భూమిని ఈ పరిస్థితికి తీసుకువచ్చాయని పేర్కొటున్నారు. ఈ పరిస్థితిని తగ్గించేందుకు అందరూ తక్షణ చర్యలు తీసుకోవాలని.. గ్రీన్‌హౌస్‌వాయువుల ఉద్గారాలను తగ్గించడంతో పాటు సుస్తిర విద్యుత్, వనరుల వినియోగం, పర్యావరణ సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని.. భవిష్యత్తరాల కోసం భూమిని రక్షించాలని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.