Black Magic | మెక్సికో సిటీ: చేతబడి చేసి తన బిడ్డను అనారోగ్యం పాల్జేశారన్న అనుమానంతో హైతీలోని నేర సామ్రాజ్యానికి చెందిన ఓ ముఠా నాయకుడు రాజధాని సిటి సోలీల్లోని మురికివాడలో నివసించే దాదాపు 110 మంది వృద్ధులను గత వారాంతంలో హతమార్చినట్లు జాతీయ మానవ హక్కుల రక్షణ వ్యవస్థ(ఆర్ఎన్డీడీహెచ్) వెల్లడించింది. మృతులందరూ 60 ఏళ్లు పైబడినవారేనని హక్కుల సంస్థ పేర్కొంది.
తన బిడ్డ అనారోగ్యానికి గురికావడంతో వార్ఫ్ జెరెమీ అనే గ్యాంగుకు చెందిన నాయకుడు మోనెల్ మికనో ఫెలిక్స్ ఈ ఊచకోతకు ఆదేశించినట్లు సంస్థ వివరించింది. మురికివాడకు చెందిన వృద్ధులు చేసిన చేతబడి వల్లే బిడ్డకు హాని జరిగిందని వూడో పూజారి ఆరోపించడంతో ఫెలిక్స్ ఈ దారుణానికి పాల్పడినట్లు హక్కుల సంస్థ పేర్కొంది.