Chinese Woman | వివాహ బంధంలో అడుగుపెట్టిన ప్రతి జంట.. అటు కష్టనష్టాల్లో, ఇటు ఆరోగ్య విషయాల్లో జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని నిశ్చయించుకుంటారు. అందుకనుగుణంగా ఆ దంపతులు తమ జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ సంసార జీవితంలో మునిగిపోతారు. ఆ మాదిరిగానే ఓ భార్య తన భర్తను బతికించుకునేందుకు పడరాని కష్టాలు పడుతోంది. కోమాలో ఉన్న భర్తను బతికించుకోవడమే లక్ష్యంగా కుడుములు అమ్ముతూ.. ప్రతి పైసా కూడబెడుతోంది. అలా ఇప్పటి వరకు లక్షల రూపాయాలు భర్త ఆరోగ్యం కోసం ఖర్చు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. చైనా జియాంగ్సీ ప్రావిన్స్‌లోని అనై కంటీకి చెందిన నీ అనే మహిళకు డింగ్ అనే వ్యక్తితో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి తర్వాత కుటుంబాన్ని పోషించుకునేందుకు నీ, డింగ్ కలిసి హోమ్మేడ్ నూడిల్స్, కుడుములు తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో నూడిల్స్, కుడుములను హోం డెలివరీ చేస్తుండగా, డింగ్ రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతను మెదడు తీవ్రంగా దెబ్బతిన్నది. కోమాలోకి వెళ్లిపోయాడు.
భర్త డింగ్‌ను బతికించుకునేందుకు ఇల్లును అమ్మేసింది నీ. అయిన అతని వైద్యానికి డబ్బులు సరిపోవడం లేదు. ఇక చేసేదేమీ లేక మళ్లీ సొంతంగా కుడుములు తయారు చేయడం ప్రారంభించింది. అలా కుడుములు తయారు చేస్తూ విక్రయిస్తూ, లక్షల రూపాయాలు కూడబెట్టింది.
ఈ సందర్భంగా నీ మాట్లాడుతూ.. నేను నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను. సంవత్సరం, రెండేండ్లు, మూడేండ్లు అయినా ఆగుతాను. డింగ్ ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. అతను పూర్తిగా కోలుకుంటాడన్న నమ్మకం నాకు ఉందన్నారు. ఇప్పటి వరకు డింగ్ ఆరోగ్యం కోసం రూ. 71 లక్షలు ఖర్చు పెట్టినట్లు నీ తెలిపారు.