న్యూఢిల్లీ, మే 25 : క్యాన్సర్ నిర్ధారణలో వైద్యులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న వైద్య పరికరాల పరిమాణం చాలా పెద్దది. చైనా సైంటిస్టులు.. దీనిని చేతిలో పట్టే ఒక పరికరంగా కుదించగలిగారు. ‘నానోఫొటోనిక్ బయోసెన్సింగ్’ అనే పరికరాన్ని చైనాలోని (హాంగ్జౌ) ‘వెస్ట్‌లేక్ వర్సిటీ’ సైంటిస్టులు తయారుచేశారు. దీనిపై ‘నేచర్ ఫొటోనిక్స్’ జర్నల్ కథనం ప్రకారం, ఒకే ఒక్క రక్తపు చుక్కను తీసుకొని.. ‘నానోఫొటోనిక్ బయోసెన్సింగ్’ పరికరం అత్యంత కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో ఉండే కచ్చితత్వంతో పోల్చితే..
దీంట్లో 10,000 రెట్లు ఎక్కువ కచ్చితత్వంతో క్యాన్సర్‌ను గుర్తించొచ్చు. మన శరీరంలో క్యాన్సర్ ఉందా? లేదా? అన్నది చెప్పేది రక్తమే. దీంట్లో వచ్చిన మార్పులను గుర్తించడానికి కాంతి కిరణాలను ఉపయోగిస్తారు. దీనిని విశ్లేషించడానికి చైనా శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన ‘త్రీడీ చిప్’ను ఉపయోగించారు. రక్తంలోని సూక్ష్మమైన మార్పును గుర్తించటంలో ‘నానోఫొటోనిక్ బయోసెన్సింగ్’ పరికరానికి ఈ త్రీడీ చిప్ దోహదపడుతుంది.