బీజింగ్: రాడార్ల పట్ల స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, వైర్లెస్ నెట్‌వర్క్‌లు పని చేసే తీరును మార్చగలిగే సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అభివృద్ధి చేసినట్లు తెలుస్తున్నది. ఎలక్ట్రోమేగ్నటిక్ సిగ్నల్స్‌ను పవర్, కమ్యూనికేషన్ల వనరుగా మార్చడం ద్వారా, భవిష్యత్తులో రాడార్లను మిలిటరీ స్టెల్త్, నెక్స్జనరేషన్ 6జీ కనెక్టివిటీల కోసం ఉపయోగించవచ్చు. స్టెల్త్ టెక్నాలజీ వల్ల విమానాలు రాడార్ల నుంచి తప్పించుకోగలుగుతాయనే సంగతి తెలిసిందే. జిడియాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఈ పరిశోధనను నిర్వహించింది. అత్యాధునిక కమ్యూనికేషన్స్ టెక్నాలజీ, ఎలక్ట్రోమేగ్నటిక్ ఇంజినీరింగ్‌లను కలిపి వీరు పరిశోధన చేశారు. శత్రు సెన్సర్ల నుంచి దాక్కోవడంపై మాత్రమే దృష్టి పెట్టడానికి బదులుగా, ఎలక్ట్రోమేగ్నటిక్ కోఆపరేటివ్ స్టెల్త్ (కొన్ని విమానాలు, డ్రోన్లు, నెట్వర్క్ సిస్టమ్స్ కలిసికట్టుగా పని చేసి శత్రు రాడార్లు, డిటెక్షన్ సిస్టమ్స్‌ను తప్పుదోవ పట్టించడం) గురించి పరిశోధన చేశారు.
ఏకైక హార్డ్‌వేర్ ప్లాట్‌ఫాంలో కమ్యూనికేషన్, సెన్సింగ్, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయగలిగే సెల్ఫ్ సస్టెయినింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అభివృద్ధి కోసం కృషి చేశారు. దీని అర్థం ఏమిటంటే, విమానాలు, డ్రోన్లు వంటి వాటిని గుర్తించేందుకు లేదా కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే ఎలక్ట్రోమేగ్నటిక్ తరంగాలను విద్యుత్తు ఉత్పత్తి వనరుగా మార్చుకోగలగడమే. సిద్ధాంతం ప్రకారం, స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్ కేవలం శత్రు రాడార్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం మాత్రమే కాకుండా, రాడార్ ఎనర్జీని శోషించుకోగలుగుతుంది, దానిని తన సిస్టమ్స్ పని చేయడానికి ఉపయోగించుకోగలుగుతుంది, కమ్యూనికేట్ కూడా చేయగలుగుతుంది. ఈ పరిశోధక బృందం నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్‌లో ప్రచురించిన వ్యాసంలో, “6జీ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటెలిజెంట్ స్టెల్త్, సంబంధిత ఇతర రంగాలపై దీని ప్రభావం విస్తృతంగా ఉంటుంది” అని పేర్కొంది.