ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ నెల 15న ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన సైబర్ క్రైమ్ సెల్ అధికారులు చైనీయులు నడుపుతున్న ఓ ఫేక్ కాల్ సెంటర్‌పై దాడి చేశారు. దీనిలో పాకిస్థానీలు, చైనీయులు సహా కొందరు విదేశీయులు పని చేస్తున్నట్లు గుర్తించారు. వీరు ఇంటర్నేషనల్ ఫ్రాడ్ బిజినెస్‌ను నిర్వహిస్తున్నారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో 24 మందిని అరెస్ట్ చేశారు.
కొందరు అనుమానితులు తప్పించుకుపోయారు. అయితే, ఈ దాడుల సమయంలో భద్రతా సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడంతో స్థానికులు రెచ్చిపోయారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించిన వీడియోల ప్రకారం, చాలా మంది స్థానికులు ఈ కాల్ సెంటర్ భవనంలోకి చొరబడి, విలువైన ల్యాప్‌టాప్‌లు, టెక్నికల్ పరికరాలను దోచుకుపోయారు. ఇవన్నీ సాక్ష్యాధారాలుగా కోర్టులో సమర్పించవలసి ఉండగా, దోపిడీకి గురికావడంతో అధికారులు అవాక్కయ్యారు.