China on Taiwan : చైనా-తైవాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్‌కు 200 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా అంగీకరించింది. ఈ ఒప్పందాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. వీటిని తక్షణం నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది.
‘తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలి. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన చర్యలను వెంటనే ఆపాలి. చైనా తన జాతీయ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది’ అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో పేర్కొన్నది.
మరోవైపు ఆయుధాల విక్రయంపై తైవాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం స్పందించింది. చైనా బెదిరింపుల నేపథ్యంలో మాతృభూమిని రక్షించుకునే బాధ్యత తమకు ఉందని వెల్లడించింది. కాగా తైవాన్ తమ దేశంలో భాగమని బీజింగ్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల తమ దేశం చుట్టూ 153 చైనా సైనిక విమానాలు చక్కర్లు కొట్టినట్లు తైవాన్ రక్షణశాఖ వెల్లడించింది.
అంతేగాక యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన దళాలకు పిలుపునిచ్చినట్లు ఆ దేశానికి చెందిన మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తైవాన్‌కు 200 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా అంగీకారం తెలిపింది. ఈ ఒప్పందం చైనాకు మింగుడు పడటంలేదు.