బీజింగ్ : చైనా స్టేట్ కౌన్సిల్ తన ఇమిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు చేసింది. కొత్తగా కే-వీసాను ప్రకటించింది. ఇది వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇతర స్టెమ్ (ఎస్టీఈఎం) రంగాల్లోని యువ విదేశీ ప్రతిభావంతులను ఆకర్షించడమే లక్ష్యంగా దీనిని ప్రకటించింది. నిపుణులైన యువత చైనాలోకి చాలా సులువుగా ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తున్నది. అనేక సంవత్సరాలుగా అత్యుత్తమ నైపుణ్యంగల వర్కర్లకు అమెరికాలో పని చేయడానికి హెచ్-1బీ వీసా ప్రధాన మార్గంగా ఉంటున్నది. ముఖ్యంగా టెక్నాలజీ, రిసెర్చ్ రంగాల్లోని వారు ఈ వీసాతోనే వెళ్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీసా నిబంధనలను కఠినతరం చేయడంతోపాటు వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడంతో, భారత్, చైనా వంటి దేశాలకు చెందిన ప్రొఫెషనల్స్‌కు అమెరికా పట్ల ఆకర్షణ తగ్గవచ్చు.
చైనా ప్రకటించిన కొత్త కే-వీసాను చాలా సులువుగా పొందవచ్చు. లోకల్ కంపెనీ స్పాన్సర్షిప్ అవసరం ఉండదు. చైనాలో విదేశీ వర్కర్లు పని చేసే కాలం, విధానాలు నిపుణులకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటి వరకు చైనా ఎంట్రీ-ఎగ్జిట్ రూల్స్ 12 కేటగిరీల ఆర్డినరీ వీసాలను గుర్తిస్తున్నాయి. వీటిలో వర్క్, స్టడీ, బిజినెస్, ఫ్యామిలీ రీయూనియన్ వీసాలు ఉన్నాయి. ఈ నిబంధనలను సవరించి 13వ క్యాటగిరీ కే-వీసాను చేర్చారు. చైనా అధికారులు నిర్దేశించిన నిబంధనలను దరఖాస్తుదారులు పాటించాలి. అభ్యర్థులు తమ అర్హతను రుజువు చేసుకోవడానికి చెల్లుబాటయ్యే పత్రాలను సమర్పించాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతున్న లేదా పని చేస్తున్నవారి కోసం ఈ కే-వీసాను రూపొందించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లో గ్రాడ్యుయేట్లు అర్హులు. దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాయం లేదా రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పొంది ఉండాలి. అమెరికా వెలుపల కొత్త అవకాశాల కోసం ప్రతిభావంతులు ఎదురు చూస్తున్న తరుణంలో చైనా ఈ కే-వీసాను ప్రకటించింది.