బీజింగ్ : చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 96 సంవత్సరాలు. ల్యుకేమియా, వివిధ అవయవాల వైఫల్యంవల్ల ఆయన షాంఘైలో ఈ మధ్యాహ్నం 12.13 గంటలకు మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ, పార్లమెంటు, క్యాబినెట్, సైన్యం జియాంగ్ జెమిన్ మరణాన్ని ధ్రువీకరిస్తూ దేశ ప్రజలకు ఓ లేఖను విడుదల చేశాయి.
కామ్రేడ్ జియాంగ్ జెమిన్ మరణంవల్ల కమ్యూనిస్టు పార్టీకి, సైన్యానికి, అన్ని రకాల దేశీయ వర్గాల ప్రజలకు పూడ్చలేని నష్టం జరిగినట్లు ఆ లేఖలో పేర్కొన్నాయి. తమ ఆత్మీయ కామ్రేడ్ జియాంగ్ అసాధారణ నేత అని, అత్యున్నత స్థాయి గౌరవనీయుడని తెలిపాయి. ఆయన గొప్ప మార్క్సిస్ట్, వక్త, మిలిటరీ స్ట్రాటజిస్ట్, దౌత్యవేత్త, సుదీర్ఘ పరీక్షలకు నిలిచిన కమ్యూనిస్ట్ యోధుడు అని కొనియాడాయి.