CAS | బీజింగ్, ఫిబ్రవరి 21: గుండె జబ్బుల ముప్పు తగ్గించే బియ్యం, గోధుమల రకాలను అభివృద్ది చేశారు చైనా పరిశోధకులు. జన్యు మార్పులతో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్(సీఏఎస్)కు చెందిన పరిశోధక బృందం తయారుచేసిన ఈ కొత్త వరి, గోధుమ వంగడాలకు సంబంధించిన వివరాలు ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గుండె జబ్బుల ముప్పును తగ్గించే కోఎన్జైమ్ క్యూ10 అనే రకమైన యాంటీఆక్సిడెంట్‌ను ఈ వరి, గోధుమ రకాలు కలిగి ఉంటాయని పరిశోధకులు తెలిపారు. సీఓక్యూ10, యుబిక్వినోన్ అని కూడా పిలిచే ఈ యాంటీఆక్సిడెంట్‌ను మానవ శరీరం సహజంగానే ఉత్పత్తి చేస్తుందని, వయసు పెరుగే కొద్దీ, శరీరంలో దీని ఉత్పత్తి తగ్గిపోయి, గుండెజబ్బుల ముప్పు పెరుగుతుందని చెప్పారు.
కూరగాయలు, చేపలు, మాంసం, గింజల్లో సీఓక్యూ10 సహజంగా లభిస్తుందని, బియ్యం, గోధుమలు, ఓట్స్‌లో మాత్రం సీఓక్యూ9 అనే మరో రకమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుందని తెలిపారు. సీఓక్యూ10 ఇచ్చే ప్రయోజనాలను సీఓక్యూ9 ఇవ్వదని చెప్పారు. 134 రకాల వరి, గోధుమ వంగడాలపై అధ్యయనం చేసిన తర్వాత, సీఓక్యూ10 ఉత్పత్తి చేసేలా జన్యుపరమైన మార్పులు చేసిన కొత్త రకాలను అభివృద్ధి చేసినట్టు తెలిపారు.