వాషింగ్టన్: అణు సామర్థ్యం కలిగిన ఖండాంతర క్షిపణిని చైనా(China ICBM) పరీక్షించింది. చరిత్రాత్మక ఆ పరీక్షను సోమవారం నిర్వహించింది. చైనీస్ నేవీకి చెందిన జలాంతర్గామి నుంచి ఆ పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. ఐసీబీఎంపై డమ్మీ వార్‌హెడ్‌ను మోసుకెళ్లారు. గుర్తు తెలియని లొకేషన్ నుంచి సోమవారం 12 గంటలకు ఆ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడైంది. అయితే పసిఫిక్ సముద్రంలో ఉన్న జలాల్లో టార్గెట్‌ను ఆ క్షిపణి పేల్చినట్లు నేవీ ప్రతినిధి వాంగ్ జూయిమెంగ్ తెలిపారు. చైనా వార్షిక సైనిక విన్యాసాల్లో భాగంగా ఖండాంతర అణు క్షిపణిని పరీక్షించినట్లు చైనా చెప్పింది. అయితే సంబంధిత దేశాలకు ఈ సమాచారాన్ని ముందుగానే తెలియజేసినట్లు చైనా అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆ పరీక్ష జరిగిందని పేర్కొన్నది. నిర్దేశిత టార్గెట్‌ను కానీ, దేశాన్ని కానీ టార్గెట్ చేయలేదని అధికారులు వెల్లడించారు.
చైనా నిర్వహించిన ఆ పరీక్ష పట్ల అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. యూఎన్ భద్రతా మండలి ఆదేశాల ప్రకారమే ఖండాంతర క్షిపణి ప్రయోగాలు చేయాలని అమెరికా తెలిపింది. తమ ఆయుధ సమీకరణపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చైనాకు సూచన చేసింది. జలాంతర్గామి నుంచి అణు సామర్థ్యం కలిగిన ఐసీబీఎం క్షిపణిని చైనా టెస్ట్ లాంచ్ చేసిన అంశాన్ని మానిటర్ చేశామని అమెరికా ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. అణు నిరాయుధీకరణ కోసం అమెరికా ప్రయత్నం చేస్తున్న వేళ.. చైనా మాత్రం దానికి విరుద్ధంగా అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోందన్నారు. యూఎన్‌లోని శాశ్వత సభ్యుల కమిట్మెంట్ ప్రకారం ఖండాంతర క్షిపణి, అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించాలని అమెరికా తన ప్రకటనలో పేర్కొన్నది.
ఆ పరీక్షకు చెందిన పూర్తి వివరాలను చైనా నేవీ ఇంకా వెల్లడించలేదు. ఎటువంటి సబ్‌మెరైన్ ఈ మిషన్‌లో పాల్గొన్నది, ఎటువంటి మిస్సైల్‌ను వాడిందో ఇంకా తెలియలేదు. ఆపరేషన్‌కు చెందిన లొకేషన్లు తెలియవు, ఎంత దూరం ఆ క్షిపణి వెళ్లిందో కూడా చైనా వెల్లడించలేదు. 1988లో చివరిసారి చైనా ఐసీబీఎం పరీక్షకు చెందిన వివరాలను చెప్పింది. ఆ ఏడాది సెప్టెంబర్‌లో బోహాయి సముద్రం నుంచి జేఎల్-1 న్యూక్లియర్ కేపబుల్ మిస్సైల్‌ను చైనా పరీక్షించింది. ప్రస్తుతం జేఎల్-2 ఐసీబీఎంను వాడి ఉంటారని భావిస్తున్నారు.