AI Heroine | సినిమా రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, డిజిటల్ క్యారెక్టర్ల తర్వాత ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI) నేరుగా నటన రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్లో రూపొందుతున్న ఓ సినిమా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తిస్థాయి AI పాత్రను హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న ‘మిస్అలైన్డ్’ (Misaligned) చిత్రం సినీ పరిశ్రమలో కొత్త చర్చకు తెరలేపుతోంది.ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తోంది టిల్లీ నార్వూడ్ (Tilly Norwood) అనే డిజిటల్ AI నటి. ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే పూర్తిస్థాయి AI హీరోయిన్‌తో రూపొందుతున్న తొలి ప్రధాన చిత్రంగా ప్రచారం పొందుతోంది. ‘పార్టికల్ 6’ అనే AI ఆధారిత స్టూడియో ఈ సినిమాను నిర్మిస్తోంది.
సినిమాల్లో హీరోయిన్ కావాలని కలలు కనే వేలాది మంది మధ్య ఇప్పుడు ఒక AI పాత్ర ప్రధాన నాయికగా తెరపైకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘మిస్అలైన్డ్’ ఒక సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా. కథ మొత్తం ‘టిల్లీవర్స్’ అనే క్లౌడ్ ఆధారిత డిజిటల్ ప్రపంచంలో సాగుతుంది.కథానాయిక టిల్లీకి నిజమైన శరీరం ఉండదు. చిన్ననాటి జ్ఞాపకాలు, వ్యక్తిగత అనుభవాలు కూడా ఉండవు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ప్రపంచాన్ని అర్థం చేసుకునే AI రూపమే ఆమె. కథలో కీలక మలుపు ఏమిటంటే… డార్క్ వెబ్‌కు చెందిన ఓ రోగ్ బాట్ టిల్లీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆమె తనకు విధించిన నియమాలను అతిక్రమిస్తూ, మనుషుల మాదిరిగా భావోద్వేగాలు, కోరికలు, స్వతంత్ర ఆలోచనలను అనుభవించడం ప్రారంభిస్తుంది. ఒక AI జీవి మానవత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఎదుర్కొనే సంఘటనలే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం.
టిల్లీ నార్వూడ్ను ప్రముఖ నటుల ఏజెన్సీ ప్రాతినిధ్యం వహించనున్నట్లు వార్తలు వెలువడినప్పటి నుంచే హాలీవుడ్లో చర్చ మొదలైంది. ముఖ్యంగా నటీనటుల సంఘాలు, రచయితల సంఘాలు AI వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశాయి. గ్రాఫిక్స్, డబ్బింగ్ లేదా డిజిటల్ ఎఫెక్ట్స్‌కే పరిమితం కాకుండా, భవిష్యత్తులో AI నేరుగా నటుల స్థానాలను భర్తీ చేసే పరిస్థితి వస్తే సినీ రంగంలో ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం AI నటీనటుల ప్రయోగాలు హాలీవుడ్‌కే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో ఈ సాంకేతికత భారతీయ సినీ పరిశ్రమలోకి కూడా రావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల్లో కొన్ని ప్రత్యేక పాత్రల కోసం లేదా సాంకేతిక ప్రయోగాల కోసం AI ఆధారిత పాత్రలను ఉపయోగించే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు.అయితే, ప్రధాన నటీనటులను పూర్తిగా AIతో భర్తీ చేయడం వంటి అంశాలు ప్రస్తుతం ఊహాగానాలే. అలాంటి మార్పులు జరిగే అవకాశాలు, వాటి ప్రభావం గురించి ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు.