న్యూయార్క్ : అమెరికా పొలిటికల్ ఇన్ఫ్లూయెన్సర్ ఛార్లీ కిర్క్(Charlie Kirk) హత్య కేసులో కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఉటా వాలీ యూనివర్సిటీలో జరిగిన హత్య కేసులో నిందిత షూటర్ వాడిన గన్ వివరాలను పోలీసులు కనుగొన్నారు. ఆ షూటర్ మౌసర్ కంపెనీకి చెందిన .30-06 బోల్ట్ యాక్షన్ రైఫిల్‌ను వాడినట్లు గుర్తించారు. ఇది హై పవర్ రైఫిల్ అని నిపుణులు చెబుతున్నారు. కానీ సాధారణంగా జింకలను వేటాడేందుకు అమెరికన్లు ఎక్కువగా ఆ రైఫిల్స్‌ను వాడుతుంటారు. బిల్డింగ్ మీద నుంచి కిర్క్‌ను షూట్ చేసిన అతను.. అక్కడ నుంచి సమీపంలో ఉన్న పొదల్లోకి పారిపోయాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఓ కన్స్ట్రక్షన్ సైట్లోకి వెళ్లాడు. మళ్లీ అక్కడ నుంచి ఆ షూటర్ మాయమైనట్లు ఎప్బీఐ అధికారులు చెబుతున్నారు.
షూటర్ వాడిన రైఫిల్ దొరకడం కీలక పరిణామం అని స్థానిక పోలీసు ఆఫీసర్ వెల్లడించారు. గన్ మీద ఉన్న ఫింగర్‌ప్రింట్స్‌ను విశ్లేషించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ రైఫిల్‌కు ఉన్న సీరియల్ నెంబర్ ద్వారా ఆ షూటర్ వివరాలు కూడా తెలిసే అవకాశం ఉన్నది. ఈ కేసులో అరచేతి ముద్ర, షూ ప్రింట్ కూడా కీలకం కానున్నది. సింగిల్ షాట్లో కిర్క్‌ను షూట్ చేశాడంటే, అతను బోల్ట్ యాక్షన్ రైఫిల్ వాడడం ఖాయమని ఓ నిపుణుడు పేర్కొన్నాడు. .30-06 గన్ సాధారణ హంటింగ్ క్యాలిబర్ రైఫిల్ అని తెలిపారు. అయితే ఇది ఇంపోర్ట్ చేసిన ఓల్డర్ మోడల్ గన్ అని అంచనా వేస్తున్నారు. హంటింగ్ క్యాలిబర్ గన్ మ్యాగ్జిన్‌లో అయిదు రౌండ్ల బుల్లెట్లు ఉంటాయి. బోల్ట్ యాక్షన్ రైఫిల్స్ అంటే.. ఒక్క సారి ట్రిగ్గర్ నొక్కితే, అప్పుడు ఓ రౌండ్ ఫైర్ అవుతుంది. మళ్లీ షూటర్ మరో రౌండ్ కోసం మాన్యువల్‌గా ఛాంబర్ వాడాల్సి ఉంటుంది. అయితే సెమీ ఆటోమెటిక్ రైఫిల్‌కు ఇది భిన్నంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కొంత దూరం నుంచి షూట్ చేశాడంటే, అతను చాలా ప్రాక్టీస్ చేసి ప్రిపేరైనట్లు అంచనా వేస్తున్నారు. కానీ ఆ షూట్ చేయాలంటే పోలీసు లేదా ప్రత్యేక మిలిటరీ ఆఫీసర్ లేదా స్నైపర్ కావాల్సిన అవసరం లేదని కూడా నిపుణులు పేర్కొన్నారు. పోలీసులు ప్రకారం కిర్క్‌ను షూట్ చేసిన షూటర్ అతనికి సుమారు 150 గజాల దూరంలో ఉన్నట్లు భావిస్తున్నారు. అంటే టార్గెట్‌కు షూటర్ చాలా దగ్గరగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రికవరీ చేసిన .30-06 రైఫిల్ ఆధారంగా .. అనుభవం లేకున్నా.. షూటర్ ఆ గన్ను వాడవచ్చు అని ఎక్స్పర్ట్స్ వెల్లడించారు.
తప్పించుకునే ప్రణాళికలో భాగంగానే నిందితుడు ఆ గన్ను వదిలేసి ఉంటాడని ఆయుధ నిపుణులు అనుమానిస్తున్నారు. లాంగ్ రైఫిల్‌ను తీసుకెళ్లి, వదిలేయడం ఆశ్చర్యంగా ఉందని ఓ ఎఫ్‌బీఐ ఆఫీసర్ తెలిపారు. ప్రస్తుతం అనుమానిత షూటర్ గురించి గాలింపు కొనసాగుతోంది. అతని సమాచారాన్ని ఇస్తే లక్ష డాలర్లు ఇస్తామని ఎఫ్‌బీఐ ప్రకటించింది.