శాక్రామెంటో, జనవరి 22: గోర్లకు చేసే జెల్ మెనిక్యూర్ కోసం వినియోగించే అల్ట్రావయలెట్(యూవీ) డ్రయర్ల వల్ల క్యాన్సర్ ముప్పు ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యూవీ డ్రయర్లపైన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన అధ్యయనం వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 20 నిమిషాల సెషన్లో యూవీ లైట్ కింద ఉన్న శరీర కణాల్లో 20 నుంచి 30 శాతం కణాలు చనిపోతాయని, మూడు 20 నిమిషాల సెషన్లలో 65 శాతం నుంచి 70 శాతం కణాలు చనిపోతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
మిగతా కణాలు కూడా రోగ నిరోధకతను కోల్పోవడంతో పాటు డీఎన్ఏ ధ్వంసమవుతుందని, ఇది స్కిన్ క్యాన్సర్కు కారణం కావచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘యూవీ నెయిల్ పాలిష్ డ్రయర్ల వల్ల కణాల డీఎన్ఏ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయిన డీఎన్ఏ చాలాకాలం పాటు మళ్లీ బాగుకావడం లేదు. స్కిన్ క్యాన్సర్ బాధితుల కణాల్లో ఉండే మ్యుటేషన్లే యూవీ డ్రయర్లు ఉపయోగించిన వారిలో కనిపిస్తున్నాయి.’ అని శాస్త్రవేత్త లుడ్మిల్ అలెజ్గాన్డ్రోవ్ తెలిపారు.