వాషింగ్టన్, జనవరి 5: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొంటున్న క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. క్యాన్సర్ కణాల ద్వారానే క్యాన్సర్‌ను నియంత్రించేలా కొత్త సెల్ థెరపీని అమెరికాలోని బ్రిఘమ్ అండ్ విమెన్ హాస్పిటల్‌లోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇప్పటికే శరీరంలో ఏర్పడిన క్యాన్సర్ కణితులను తొలగించడం, ఎక్కువ కాలం నిలిచే రోగ నిరోధక శక్తిని నిర్మించడం, క్యాన్సర్ మళ్లీ అభివృద్ధి చెందకుండా రోగ నిరోధక శక్తిని సంసిద్ధం చేయడం ఈ కొత్త సెల్ థెరఫీ లక్ష్యాలు. దీనిని ఎలుక మీద ప్రయోగించగా సత్ఫలితాలను ఇచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
‘మాది చాలా సాధారణ ఆలోచన. క్యాన్సర్ కణాలను సేకరించి వాటినే క్యాన్సర్‌ను చంపే కణాలుగా, వ్యాక్సిన్లుగా మార్చడమే మా ఆలోచన.’ అని శాస్త్రవేత్త ఖలీద్ షా తెలిపారు. జీన్ ఇంజినీరింగ్ ప్రక్రియను ఉపయోగించి క్యాన్సర్ కణాలనే.. క్యాన్సర్ కణితుల కణాలను చంపేలా, ప్రాథమిక కణితులను నిర్మూలించి, క్యాన్సర్‌ను అడ్డుకునేలా మారుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి చికిత్సలకు, ప్రయోగాలకు నిర్వీర్యం చేసిన క్యాన్సర్ కణాలను ఉపయోగిస్తారు. జీవించి ఉన్న కణాలనే పునర్వినియోగించడం తమ కొత్త విధానంలో ప్రత్యేకతగా ఆయన చెబుతున్నారు.