టోక్యో: కెనడాకు చెందిన ఓ టీనేజర్.. సుమారు 1200 ఏళ్ల క్రితం నాటి జపాన్ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు. ఆలయంలో ఉన్న పురాతన కాలం నాటి చెక్కపై అతను తన పేరును చెక్కాడు. నారా ప్రాంతంలో ఉన్న శతాబ్ధాల క్రితం నాటి తోషోదయిజి కొండో టెంపుల్(Toshodaiji Temple)లో జూలై 7వ తేదీన ఈ ఘటన జరిగింది. ఈ ఆలయాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తిస్తారు.
ఆలయంలో ఉన్న 8వ శతాబ్ధానికి చెందిన వుడెన్ కర్రపై ఆ టీనేజర్ జులియన్ అని రాశాడు. తన చేతి వేలి గోళ్లతో అతను ఆ పేరును చెక్కాడు. పిల్లర్‌పై పేరును చెక్కుతున్న సమయంలో ఓ జపాన్ టూరిస్టు చూసి అడ్డుకున్నాడు. ఈ ఘటన గురించి పోలీసుల్ని అలర్ట్ చేశాడు. దీంతో అతన్ని విచారిస్తున్నారు.
చేసిన తప్పును ఆ టీనేజర్ అంగీకరించాడు. జపాన్ సంస్కృతిని దెబ్బతీయడం తన ఉద్దేశం కాదన్నాడు. చెడు ఉద్దేశంతో అతను చేయకున్నా.. అది క్షమించరాని తప్పు అని ఆ ఆలయానికి చెందిన బౌద్ధ సన్యాసి ఒకరు తెలిపారు. జపాన్ చట్టాల ప్రకారం ఏదైనా వారసత్వ సంపదకు హాని చేస్తే, అతనికి అయిదేళ్ల శిక్ష విధిస్తారు. లేదంటే మూడు లక్షల యెన్లు చెల్లించాల్సి ఉంటుంది.